గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఎన్నారై ఆస్పత్రి.. మెడికల్ కాలేజీ ఇప్పుడు రాజకీయవర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు హఠాత్తుగా నలుగురు డైరక్టర్లపై కేసులు పెట్టారు. దీనికి కారణం డాక్టర్ బుచ్చయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. కానీ ఆ బుచ్చయ్య .. తాను కేసులు ఉపసంహరించుకుంటానని పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. తమ మధ్య ఉన్న గొడవలను తాము పరిష్కరించుకుంటామని… కేసు నమోదు చేయవద్దని పోలీసులకు చెప్పారు. ఎప్పుడో నెల మూడు క్రితం చేసిన ఫిర్యాదుపై ఇప్పుడు కేసులు నమోదు చేయడం ఏమిటని ఆయన పోలీసుల వద్ద ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
నిజానికి డాక్టర్ బుచ్చయ్య ఎప్పుడో మూడో నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు ఉన్నాయి. ఈ కారణంగా ఆయన ఫిర్యాదు చేశారు. కానీ అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా నలుగురు డైరక్టర్లపై కేసులు పెట్టి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి కారణం… గురువారం రోజు.. ఆస్పత్రి డైరక్టర్ల బోర్డు భేటీ ఉండటమే. మూడు నెలల కాలంలో వచ్చిన మార్పేమిటంటే.. ఆస్పత్రిపై వైసీపీ బడా నాయకుల కన్ను పడటమే. ఆ ఆస్పత్రిని కైవసం చేసుకోవడానికి బోర్డు డైరక్టర్ల మధ్య ఉన్న విబేధాలను ఆసరాగా చేసుకుని… అధికార పార్టీ అండతో రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.
పిట్టపోరు.. పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా.. తమ మధ్య ఉన్న గొడవలను ఆసరాగా చేసుకుని సెటిల్మెంట్ తరహాలో.. ఆస్పత్రినే కైవసం చేసుకునేందుకు అధికార గద్దలు వాలుతున్నాయని అవగాహనకు రాగానే.. డైరక్టర్లకూభయం వేసింది. ఎక్కడ ఆస్పత్రి కొట్టేస్తారోనని… వివాదాన్ని తామే పరిష్కరించుకోవాలనుకున్నారు. అందుకే… ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు బుచ్చయ్య సిద్ధపడ్డారు. కానీ.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత కేసు విత్ డ్రా కుదరదని తాము అరెస్టులు చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే డైరక్టర్లపై ఒత్తిడి పెంచడానికి … పోలీసులు సోదాల పేరుతో మరో ఆట ప్రారంభించారు. అవకతవకలనీ.. ఆరోగ్యశ్రీ బిల్లులి తగులబెట్టేశారని.. అధికార పార్టీ అనుకూల మీడియాలో ప్రచారం ప్రారంభించేశారు. మొత్తానికి ఎన్నారై ఆస్పత్రి సెటిల్మెంట్ చేయడానికి అధికారం అనే ఆయుధం ప్రయోగం చేయడం ఖాయంగా కనిపిస్తోందన్న గుసగుసలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.