వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ కింద ఎంత నలుపు పెట్టుకున్నా.. ఇతరులు మాత్రం తమ కోసం … ఏది చెబితే అది చేయాలన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల్ని పార్టీలో చేర్చుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తూ.. కండువా కప్పలేదన్న సాంకేతిక కారణం చూపి.. వారిపై అనర్హతా వేటు వేయని వైసీపీ.. ఏ పార్టీలో చేరకుండా… పార్టీ అధినేత గౌరవం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రఘురామకృష్ణరాజుపై వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది. ఇలా డిమాండ్ చేయడం కాదు.. ఏకంగా లోక్సభ స్పీకర్నే తప్పు పడుతూ.. లేఖలు రాస్తోంది. తాజాగా.. వైసీపీ రాసిన లేఖ ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో ముఖ్యంగా బీజేపీలోనూ చర్చనీయాంశం అవుతోంది.
రఘురామకృష్ణరాజు అనర్హతపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఓంబిర్లాకు విజయసాయిరెడ్డి రాసిన లేఖలో ఆయనను తప్పు పట్టే లాంగ్వేజ్ ఉంది. రఘురామను అనర్హుడిగా ప్రకటించాలని గతేడాది జులై 3న ఇచ్చిన.. లేఖపై నిర్ణయం తీసుకోలేదని.. 3 నెలల్లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని..గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయని… ఆ తీర్పులను ఓం బిర్లా ఉల్లంఘిస్తున్నారన్నట్లుగా విజయసాయిరెడ్డి ఆక్షేపించారు పార్టీకి దూరమైన రఘురామను పార్లమెంట్ సమావేశాలకు.. హాజరుకానివ్వడం అన్యాయమని లేఖలో చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి లేఖ.. అందులో లాంగ్వేజ్.. స్పీకర్ ఓంబిర్లాను బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ఉందన్న అభిప్రాయం బీజేపీలో వినిపిస్తోంది.
అనర్హతా వేటు వేయాలంటే ఇతర పార్టీల్లో చేరి ఉండాలనే నిబంధన ఉంది. అదే సమయంలో స్పీకర్ నిర్ణయమే అంతిమం. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్దేశించలేదు. అందుకే గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన అప్పటి స్పీకర్ పట్టించుకోలేదు. స్పీకర్ను కోర్టులు నిర్దేశించలేకపోయాయి. అన్నీ తెలిసి కూడా విజయసాయిరెడ్డి ..స్పీకర్ ఓం బిర్లాకు అలాంటి లేఖ రాయడం.. ఇప్పుడు… వివాదాస్పదం అవుతోంది. తమ కోసం అయితే చట్టాల్ని అమలు చేయడం… ప్రత్యర్థుల కోసం అయితే తాము చట్టాల్ని ఉల్లంఘిచడం.. వైసీపీ కి కామన్ అయిందని… ఇలాంటి పరిస్థితుల్ని సహించబోమన్న చర్చ బీజేపీలో నడుస్తోంది.