ముద్రగడ పద్మనాభం దీక్ష విరమింపచేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పెద్ద రాజకీయ సమస్య పరిష్కారమైనట్టే. అయితే దాని గురించి చెప్పేప్పుడు తగు జాగ్రత్త పాటించక ఆయన కొత్త విమర్శ కొనితెచ్చుకున్నారు. ఎవరూ ఎస్‌సిలుగా పుట్టాలని కోరుకోరు అన్న మాట నిజంగానే అభ్యంతరకరమైంది. ఆ చెప్పిన భావం సరైందా కాదా, అందులో సదుద్దేశం వుందా లేదా అన్న చర్చ పక్కనపెడితే మన సమాజంలో ఇలాటి మాటలు ఎవరూ మాట్లాడినా అనుచితమే. ఎస్‌సిలు కోట్లమంది వుండగా ఇలా అనడం వారందరూ తమపుట్టుకను తిట్టుకుంటున్నారని చెప్పినట్టవుతుంది. అది ఆత్మగౌరవం గల వారెవరూ ఆమోదించలేరు. వారు తమను తాము తిట్టుకుంటున్నారంటే మిగిలిన వారు అంతకంటే గొప్పవారా అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇక పోతే తెలుగుదేశం ఆవిర్బావం తర్వాత ఇక్కడ రాజకీయాల్లో కుల విభజన సమీకరణ స్పష్టమైన రూపం తీసుకున్నాయి. మూడవ గ్రూపుగా కాపులకోసం చిరంజీవితో సహా చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఇటీవలి ఎన్నికల ప్రణాళికలో కాపులు బ్రాహ్మణులతో సహా అన్ని తరగతులకూ తెలుగుదేశం వాగ్దానాలు చేసినప్పుడు కులం ప్రసక్తి వుండనే వుంది. ఒక్క కులం ఓట్లతోనే ఎవరూ గెలవరు గాని కొన్ని కులాలపై ప్రధానంగా ఆధారపడే రాజకీయం ఎప్పుడూ వుంది. ఆఖరుకు మాయావతి కూడా బహుజన సమాజం నుంచి సర్వజన నినాదం వైపు వచ్చారు. ఆధిపత్య కులాలనుంచి అధికారం రాబట్టుకోవడానికి ఘర్షణ జరుగుతూనే వుంటుంది. రాజ్యాంగం చెప్పే రాజకీయ సమానత్వం సమాజంలో కరుడుగట్టిన సామాజిక అసమానత్వం ఈ రెండింటి మధ్యనా వైరుధ్యం పరిష్కారం కానంతవరకూ కులాలను ఓట్లకోసం వాడుకోవడం జరుగుతూనే వుంటుంది. గుజ్జర్లు పటేళ్ల విషయంలో బిజెపి చేసిందదే, కాపులు బీసీల మధ్య ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్నదీ అదే. మండల్ కమిషన్ సిఫార్సుల అమలు ప్రకటించగానే అందుకు వ్యతిరేకంగా బిజెపి కమండల్ తీసిన సంగతి ఎవరికి తెలియదు? కుల రాజకీయాలు నిజంగా పోవాలంటే ముందు ప్రధాన పార్టీల వైఖరి మారాలి. కుల సంఘాల నాయకుల తీరు కూడా మారాలి. అదే సమయంలో ఆధిపత్య కులాలకూ అణగారిన తరగతులకూ మధ్యన తేడా పాటించడం అవసరం. హైదరాబాద్ యూనివర్సిటీ విషాదం నేర్పుతున్న పాఠం కూడా అదే. చంద్రబాబు నాయుడు మాటలు అపార్థానాకి దారి తీశాయి గనక సవరణ ఇస్తారనే అనుకుంటున్నారు. దీన్ని కేవలం ఏదో ఒక పత్రికకు అంటగట్టడం కంటే నేరుగా సవరించుకోవడం నిజంగా మంచిది.