ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై … మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లుగా వైసీపీలో ప్రచారం జరుగుతోంది. గెలిచే సీటు అయిన ఒంగోలు నుంచి ఎంపీ టిక్కెట్‌ను త్యాగం చేస్తే…టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. అదీ రెండేళ్లకే ముగిసిపోయింది. పొడిగింపు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు చివరికి హ్యాండిచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు.. పార్టీలో జగన్ తర్వాత తానే అన్నట్లుగా వ్యవహారాలు నడిపిన సుబ్బారెడ్డికి ఇప్పుడు.. ప్రభుత్వంలో ఓ పదవి తెచ్చుకోవడం కష్టంగా మారింది. తనకు వ్యతిరేకంగా.. కొంత మంది జగన్ దగ్గర పెద్ద లాబీయింగ్ నడుపుతున్నారని నమ్ముతున్నారు. ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారన్న విషయం తెలియడంతో వైసీపీ హైకమాండ్ నుంచి మీడియాకు మరో లీక్ ఇచ్చారు.
టీటీడీ చైర్మన్ పదవి మళ్లీ ఆయనకేనని.. సభ్యుల్లో మాత్రం మార్పులుంటాయని.. వారంలో పదవి ప్రకటిస్తామని.. ఆ లీక్ సారాంశం. అయితే.. దీన్ని సుబ్బారెడ్డి తో పాటు ఆయన వర్గీయులు కూడా విశ్వసించడం లేదు. కేవలం.. సుబ్బారెడ్డిని బుజ్జగించడానికి.. ఆయన ఎక్స్‌ట్రీమ్ స్టెప్ వేయకుండా ఉండటానికే.. ఈ గ్యాప్ తీసుకుంటున్నారని అంటున్నారు. ఎందుకంటే గతంలో .. అంటే.. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో.. ముందుగానే టీటీడీ బోర్డు చైర్మన్‌గా సుబ్బారెడ్డిని ప్రకటించారు. బోర్డును మాత్రం చాలా ఆలస్యంగా ప్రకటించారు. చాలా రోజుల పాటు టీటీడీ చైర్మన్ ఒక్కరే … ఉన్నారు. ఇప్పుడు మాత్రం.. అలా ఎందుకు చేయలేదని.. బోర్డు సభ్యులను మార్చాలనుకుంటే.. టీటీడీ చైర్మన్‌ను మాత్రమే ప్రకటించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని క్షత్రియ నేతకు ఇవ్వాలని జగన్ డిసైడయ్యారని అంటున్నారు. ఈ తురణంలో సుబ్బారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వైసీపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కారణం ఏమిటో కానీ.. సుబ్బారెడ్డిని జగన్మోహన్ రెడ్డి క్రమంగా దూరం పెడుతున్నారని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో బాలినేని – సుబ్బారెడ్డి వర్గాల మధ్య చాలా కాలం నుంచి పడదు. మొదట్లో సుబ్బారెడ్డి హవా నడిచేది.. ఇప్పుడు మొత్తం బాలినేని చూసుకుంటున్నారు. సుబ్బారెడ్డికి కనీస ప్రాధాన్యత కరవయింది.