ఆంధ్రప్రదేశ్ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించి నీటినీ తీసుకెళ్తోందని.. కృష్ణాబోర్డు చెప్పినా పనులు ఆపడం లేదని ఆరోపిస్తున్న తెలంగాణ సర్కార్.. తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. ఎగువ రాష్ట్రం అయిన తమతో పెట్టుకుంటే ఏం చేయగలమో అదే చేస్తామని చెప్పడమే కాదు.. చర్యలు ప్రారంభించారు. కృష్ణా నీరు దిగువకు రాకుండా ఎక్కడికక్కడ బ్యారేజీలు.. ఎత్తిపోతల పథకాలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు.. ఉత్తర్వులు కూడా తెలంగాణ సర్కార్ జారీ చేసింది. కృష్ణానదిపై కొత్త ఆనకట్ట నిర్మాణానికి సర్వే కోసం తెలంగాణ ఉత్తర్వులుఇచ్చింది. ఆనకట్టతో ఇతర ప్రాజెక్టుల నిర్మాణం సర్వే కోసం అనుమతులు ఇచ్చింది. ప్రాజెక్ట్‌ల సమగ్ర సర్వే చేపట్టేందుకు కూడా.. అంగీకరించింది. ముందుగా కృష్ణానదిలో తుంగభద్ర కలిసే చోట 35 నుంచి 40 టీఎంసీలు.. నిల్వ చేసేలా జోగులాంబ ఆనకట్ట నిర్మాణం చేస్తారు.
రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా.. నారాయణపేట జిల్లా కుసుమర్తి వద్ద వరద కాల్వ నిర్మాణం చేపడతారు. అలంపూర్, గద్వాల ప్రాంతాల్లోని రెండు లక్షల ఎకరాలకు.. నీటి కోసం సుంకేశుల జలాశయం వద్ద ఎత్తిపోతల నిర్మాణం చేపట్టేందుకు సర్వే చేస్తారు. అలాగే కల్వకుర్తి ప్రాజెక్టు కింద జలాశయాల సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. ఇక నల్గొండ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీటి కోసం.. పులిచింతల వద్ద ఎత్తిపోతల నిర్మాణం చేపట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది ఈ ప్రాజెక్టుల సర్వేకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. కేసీఆర్ కట్టదల్చుకుంటే.. వీటిని రెండు, మూడేళ్లలో కట్టగలరు. అదే జరిగితే… చివరికి పులిచింతలలోని నీటిని కూడా తెలంగాణ సర్కార్ వచ్చినవి వచ్చేసినట్లుగా ఎత్తిపోసుకుంది.
అసలు అక్కడిదాకా కృష్ణా నీరు రాకుండా ఉండటానికి ముందుగానే… అంటే… కృష్ణానదిలో తుంగభద్ర కలిసేచోట ఏకంగా నలభై టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ కట్టడానికి సర్వేకు అనుమతిచ్చేశారు. ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులే. కానీ తమ రాష్ట్రంలో తాము కట్టుకుంటే ఎవరు అడ్డుకుంటారన్న వ్యూహంతో ఏపీ సర్కార్ ఎలా కడుతుందో.. తాము కూడా అంతే కడతామని.. తెలంగాణ అంటోంది. నిజంగా కేసీఆర్ వాటిని కట్టేస్తే.. రాయలసీమకు చుక్క నీరు రాదు. కేంద్రం వద్ద .. కోర్టుల్లో పోరాడాలంటే… ముందుగా.. మీరు అనుమతుల్లేకుండా ఎలా కట్టారన్నదానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.