పారిశ్రామికరంగంలో తెలంగాణ మరో భారీ పెట్టుబడి సాధించింది. భవిష్యత్ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదేనని అంచనాలు వేస్తున్న నేపధ్యంలో ఈ రంగంలో తొలిసారిగా పెట్టుబడులు ఆకర్షించేందుకు కేటీఆర్ చేసిన ప్రయత్నం సఫలమయింది. ఈవీ రంగంలో 2100 కోట్ల పెట్టుబడికి ట్రైటాన్ సంస్థ ముందుకు వచ్చింది. ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తయ్యాయి. జహీరాబాద్ నిమ్జ్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ట్రైటన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పెట్టుబడితో సుమారు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. తొలి ఐదేళ్లలో సుమారు 50వేల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది.
ప్రస్తుతం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్… ఈవీల వినియోగం పెరుగుతోంది. ఇంధర ధరలు విపరీతంగా పెరగడం ఒక్కటే కాదు.. వాతావరణకాలుష్యం వంటి అంశాలుకూడా.. ఎలక్ట్రిక్ వాహనాలవైపు ప్రపంచం చూసేలా చేస్తోంది. ఈ క్రమంలో పెద్ద పెద్ద ఆటోమోబైల్ సంస్థలన్నీ.. మార్పును నిశితంగా గమనిస్తున్నాయి. ఆ రూటులోకి వెళ్లేందుకు పెట్టుబడులను మార్చుకుంటున్నాయి. టాటా నుంచి కియా వరకూ అన్ని సంస్థలూ… తమ ప్రణాళికల్ని ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు రాష్ట్రాలు ఎంత వేగంగా అడుగులేస్తే అంత వేగంగా… ఈవీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఆ రాష్ట్రం మారుతుంది. కేటీఆర్ ఈ విషయంలో ఓ అడుగు ముందున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రాలో పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. విజయవాడ సమీపంలో ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తి కేంద్రాన్ని అశోక్ లేలాండ్ సంస్థ ప్రారంభించింది. కానీ ప్రభుత్వం మారడం.. విధానాలు మారడం.. ఎలాంటి ప్రోత్సహాకాలు ఇవ్వకపోవడంతో ఉత్పత్తి ప్రారంభం కాలేదు. హీరో సంస్థ కూడా ఎలక్ట్రిక్ విభాగాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభించింది. ఈ ఊపును.. ఉపయోగించుకోవడంలో అక్కడి ప్రభుత్వం విఫలమయింది. ఫలితంగా… పెట్టుబడిదారుల జాబితా నుంచి ఆంధ్రప్రదేశ్ మాయమైంది. అది పొరుగు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా మారింది.