`అఖండ` తరవాత.. నందమూరి బాలకృష్ణ సినిమా ఎవరితో అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. గోపీచంద్ మలినేనితో.. బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. `క్రాక్` అయిన వెంటనే ఈ స్క్రిప్టుపై దృష్టి పెట్టాడు గోపీచంద్. కొన్ని యదార్థ సంఘటనల్ని ఆధారంగా తీసుకుని గోపీచంద్ ఈ కథని తయారు చేశాడు. ఇటీవల బాలయ్యతో ఓ సిట్టింగ్ కూడా జరిగిందని సమాచారం. అయితే బాలయ్య ఈ కథలో కొన్ని కీలకమైన మార్పులు సూచించాడని తెలుస్తోంది. హీరో క్యారెక్టరైజేషన్, క్లైమాక్స్ తదితర కీలకమైన అంశాల విషయంలో కొన్ని కరక్షన్లు చెప్పాడట. ఇప్పుడు గోపీచంద్ మలినేని ఆ రిపేర్లలో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆ ఇద్దరి హీరోయిన్ల పేర్లని ప్రకటించాలని చిత్రబృందం భావించింది. అయితే.. స్క్రిప్టు ఇంకా ఫైనల్ కాకపోవడంతో.. ఆ ఆలోచనని విరమించుకున్నారు. `అఖండ` సెట్స్‌పై ఉండగానే ఈసినిమాని మొదలెట్టాలన్నది బాలయ్య ఆలోచన. అయితే.. ఇప్పట్లో అది సాధ్యం కాకపోవచ్చు. స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్దం చేయడానికి గోపీచంద్ మరో మూడు నెలల సమయం అడిగాడని, `అఖండ` విడుదలైన తరవాతే.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని తెలుస్తోంది.