‘మా’ ఎన్నికల హంగామా 3 నెలల ముందే మొదలైపోయింది. ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ `నేను పోటీకి సిద్ధం` అని ప్రకటించినప్పటి నుంచే `మా`లో వేడి మొదలైపోయింది. విష్ణు, జీవిత, హేమ.. వీళ్లంతా పోటీలో ఉన్నామంటూ సంకేతాలు ఇచ్చారు. దాంతో ఎన్నికల వేడి అప్పుడే రాజుకున్నట్టైంది. ప్రకాష్ రాజ్ వైపే మెగా కాంపౌండ్ ఉందని, ఆయన మద్దతుతోనే ప్రకాష్‌రాజ్ ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారని వార్తలు రావడంతో చిత్రసీమలో మళ్లీ కాంపౌండ్ గోల మొదలవుతుందని భావించారు. వీటిపై… ప్రకాష్ రాజ్ స్పందించారు. “ఈ విషయంలో చిరంజీవి గారిని ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు. ఎన్నికలు అనేవి సున్నితమైన విషయం. కేవలం 800 మంది సభ్యుల సమూహం కోసం జరుగుతున్న ఎన్నికలు అంతే. దాన్ని పెద్దది చేసి చూడొద్దు“ అని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
ఈరోజు హైదరాబాద్ లోని ఎఫ్.ఎన్.సీ.సీలో ప్రకాష్ రాజ్ తన `మా బిడ్డలు` ప్యానల్ ని మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. “నిన్న మొన్న ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. సంవత్సరం నుంచీ ఈ ఆలోచన ఉంది. మూడేళ్లుగా చూస్తూనే ఉన్నాం.చూస్తూ ఊరుకుంటామా? కళాకారులంటే సున్నితమైన మనసున్నవాళ్లు. వాళ్ల వ్యవహారాలు అందరికీ ఎందుకు తెలియాలి? మేమంతా ఒకే కుటుంబం. ఎవరు ఎవరికి మద్దతు తెలిపినా, అందరూ కలిసి పనిచేసుకోవాల్సిందే“ అన్నారు. ప్రకాష్ రాజ్ పై `నాన్ లోకల్` అనే విమర్శలు అప్పుడే మొదలైపోయాయి. ప్రకాష్‌రాజ్ తెలుగువాడు కాదని, తనకి `మా`తో సంబంధం ఏమిటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
దీనిపై కూడా ప్రకాష్ రాజ్ సూటిగా సమాధానం ఇచ్చారు. ”కళాకారులకు లోకల్, నాన్ లోకల్ అని ఉండదు. వాళ్లు యూనివర్సల్. గత ఎన్నికలలో ఈ ప్రస్తావన ఎందుకు రాలేదు. ఇప్పుడే ఎందుకు వచ్చింది? అంటే మనం అంత సంచుకితంగా ఆలోచిస్తున్నామన్నమాట. నా సహాయకులకు ఇల్లు కట్టించి ఇచ్చినప్పుడు నన్ను నాన్ లోకల్ అనలేదు. రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నన్ను నాన్ లోకల్ అనలేదు. ఏడు నందులు, జాతీయ అవార్డులు తీసుకున్నప్పుడు కూడా ఈ ప్రస్తావన రాలేదు. ఇప్పుడే ఎందుకు” అని ఆయన ప్రశ్నించారు. తన ప్యానల్ ఎన్నికల తేదీ ప్రకటించేంత వరకూ మీడియాకు కనిపించదని, ఎలాంటి ప్రెస్ మీట్లూ నిర్వహించమని, ఏ డిబేట్లకూ హాజరు కామని, తమకు చాలా పనులు ఉన్నాయంటూ… తనదైన మార్క్ డైలాగులతో ఆకట్టుకున్నారు ప్రకాష్ రాజ్.