మార్పు గురించి మాట్లాడినంత సులభం కాదు మారడం. ఇతరుల మైండ్సెట్ మారాలని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ధోరణి మార్చుకోవడం లేదని తెలుగుదేశం నాయకులు, ప్రభుత్వాధికారులూ వాపోతున్నారు. ఇక్కడ చెబుతున్నవి కాస్తయినా కల్పన లేని కొన్ని వాస్తవిక ఉదాహరణలు:
- “ఎస్సిలుగా పుట్టాలని ఎవరూ కోరుకోరు” అంటూ పొరబాటుగా మాట్లాడారు. దాన్ని సవరించుకుని సరైన సంకేతాలు పంపిస్తారని భావించాం. ఆయన ఎదురుదాడికి దిగారే తప్ప దిద్దుబాటుకు ప్రయత్నించలేదు. “మా వర్గాల వారిపై ప్రభావం గురించైనా ఆలోచించాలి కదా? కొన్ని పత్రికలూ మీడియా సంస్థలూ దానిపై వివాదం పెరక్కుండా వెనక్కు నెట్టినంత మాత్రాన సమస్య సమసిపోతుందా?” అని ఒక ఎంఎల్ఎ ప్రశ్నించారు.
- “బీసీలు ఆందోళన చేస్తారని ఇప్పుడు మమ్ముల్ను వాడుకుంటున్నారు గాని మా కృష్ణయ్య పట్ల ఎలా ప్రవర్తించారు? ఆ రోజు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి తర్వాత లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని చేయలేదు. పైగా ఇప్పుడు ఆయనకు ఓట్లు తక్కువవచ్చాయని ఆయనే అంటే ఎలా? కృష్ణయ్యకు అంతర్గతంగా పార్టీ వారి నుంచి ఎంతటి సమస్యలు వచ్చాయో బాబుగారికి తెలియదా?” అని ఆయన అనుయాయుడు బీసీ నాయకుడు ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- శాసనమండలి సభ్యులొకరు ఇటీవల కలసినప్పుడు తెలుగుదేశంపై రావలసినంత విమర్శ రావడం లేదంటూ తనే కొన్ని విమర్శలు సూచించాడు!
- పెట్టుబడులను రాబట్టేందుకు అహోరాత్రాలు శ్రమిస్తున్నానని చంద్రబాబు చెబుతున్నా ఆయన ప్రభుత్వంలో పెద్ద ప్రతిపాదనలే పరిశీలనకు నోచుకోవడం లేదని ఒక నాయకుడు సోదాహరణంగా చెప్పాడు. చైనా నుంచి బ్రిటన్ నుంచి చాలా ఆసక్తికరమైన ఆఫర్స్ వచ్చినా వాటికి స్పందనే కరువైందని ఆయన చెప్పారు.
- ఒక అద్యక్ష పదవికి ఒకరిని నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించి కూడా నిష్కారణంగా పెండింగులో పెట్టడంపై ప్రభుత్వంలో కీలకస్థానంలో వున్న నాయకుడే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఎందుకిలా జరుగుతుందో తెలుసా?’ అని వాకబు చేశారు!
- అర్థం పర్థం..అంతూ పొంతూ లేని సమీక్షా సమావేశాలతో దుంప తెంచుతున్నారని అధికారి ఒకరు బాధపడ్డారు. ‘షుగర్ లెవల్స్ పడిపోతుంటే ఏం చేయాలో దిక్కు తోచదని ఇంతా చేసి కొత్తగా చెప్పేదేమీవుండదని, తన మనసులో అసలు మాట తెలియదని’ ఆయన అన్నారు.
- వయసు ప్రభావం వల్లనో మరెందుకో చంద్రబాబు ప్రతిదీ సాగదీసి మాట్లాడుతూ లేనిపోని వివాదాలు విమర్శలు కొని తెచ్చుకుంటున్నారని మరో నాయకుడు బాధపడ్డారు.
మరి చంద్రబాబు ఇలాటి వాటినీ, ప్రజల ఉద్యమాలనూ దృష్టిలో పెట్టుకుని కాస్తయినా విధానాలు ధోరణులు మార్చుకునే అవకాశం వుంటుందా అంటే ఇప్పటికి ఆ ఆశ కనిపించడం లేదు.