టీటీడీ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం.. కేవలం ఇద్దరు అధికారులతో టీటీడీ బోర్డుకు ఉండే అన్ని అధికారులతో స్పెసిఫైడ్ అధారిటీని ఏర్పాటు చేయడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. శ్రీవారికి చెందిన రూ. ఐదు వేల కోట్ల నిధులను ప్రభుత్వ బాండ్లలోకి మళ్లించేందుకే… ప్రస్తుతం ఈ వ్యూహం పన్నారన్న విమర్శలు వస్తున్నాయి. అదే అంశాన్ని వివరిస్తూ… రఘురామకృష్ణరాజు.. సీఎం జగన్కు లేఖ రాశారు. ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయని… తక్షణం స్పందించాలని కోరారు. నిజానికి గతంలో టీటీడీ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకునే దిశలో వివాదాస్పదం కావడంతో వెనక్కి తగ్గారు. శ్రీవారి నిధులను జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేస్తూంటారు.
బ్యాంకులు ప్రస్తుతం 3 నుంచి 4 శాతం మాత్రమే వడ్డీ ఇస్తున్నాయని.. అదే బాండ్ల ద్వారా 7 శాతం లభించే అవకాశం ఉందని టీటీడీ ఆర్థిక మేధావులు గతంలో ప్రకటించి… బాండ్లు కొనాలన్న అభిప్రాయానికి వచ్చారు. నిర్ణయం తీసుకున్నప్పుడు మొదట సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ దానికి రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అని సవరణ చేశారు. అంటే.. ఉద్దేశపూర్వకంగానే… శ్రీవారి నిధులను.. మళ్లించడానికి ఓ ప్లాన్ ప్రకారం ఇలా చేస్తూ వచ్చారని స్పష్టమవుతోంది. ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేస్తోంది.. ఇంకా చెల్లించాల్సిన బిల్లులు వేల కోట్లు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను కూడా తనఖా పెట్టేస్తున్నారు. ఇప్పుడు శ్రీవారి నిధులపై కన్ను పడినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఏపీ సర్కార్కు ఎక్కడా అప్పు పుట్టడం లేదు.
బ్యాంకులు కూడా.. ఏపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు చూసి.. విస్తుపోతున్నాయి. రుణాలిస్తే గోడకు కొట్టిన సున్నం అవతుందేమో అన్న ఉద్దేశంతో రుణ ప్రతిపాదనల పరిశీలన కూడా చేయడం లేదు. ఇప్పుడు… ఆదాయానికి నాలుగైదు రెట్ల ఖర్చును పెట్టుకుంటూ పోతున్న ఏపీ ప్రభుత్వానికి దిక్కుతోచని స్థితి ఏర్పడింది. అందుకే స్పెసిపైడ్ అధారిటీ ద్వారా పని పూర్తి చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. టీటీడీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. టీటీడీ నిధులు ప్రభుత్వ ఖాతాకు వెళ్తే .. తిరిగి ఇవ్వకపోయినా అడిగే నాధుడు ఉండరు. అంటే… అవి తిరిగి రాని ఖాతాలోకి చేరుతాయన్నమాట. నిజంగా స్పెసిఫైడ్ అధారిటీ ద్వారా ఐదు వేల కోట్లు ఉపసంహరించుకుని ప్రభుత్వ ఖాతాకు మళ్లిస్తే.. శ్రీవారిభక్తుల ఆగ్రహాన్ని జగన్ చవిచూడక తప్పదన్న హెచ్చరికలు ఇప్పటి నుంచే వినిపిస్తున్నాయి.