జాబ్ క్యాలెండర్‌పై ఏపీలో రచ్చ జరుగుతున్న సమయంలో…ఏపీసర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే… ఏపీపీఎస్సీ పరీక్షల్లో అసలు ఇంటర్యూలను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి గ్రూప్ -1 మినహా చాలా పరీక్షల్లో ఇప్పటికే ఇంటర్యూలు ఎత్తేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం గ్రూప్ -1కి కూడా వర్తిస్తుంది. ఆదేశాలు జారీ అయినప్పటి నుండి అమల్లోకి వస్తాయని ఏపీ సర్కార్ తెలిపింది. ప్రభుత్వం నుంచి వెలువడిన ఈ ఆదేశాలను చూసిన తర్వాత చాలా మందికి.. గ్రూప్ వన్ పరీక్షల వివాదం గుర్తుకు వచ్చింది. ఆ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో ఇంటర్యూలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ క్రమంలో ఇప్పుడు గ్రూప్ వన్ సహా అన్నింటికీ ఇంటర్యూలు ఎత్తివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. టీడీపీ హయాంలో ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ పరీక్షలు… చాలా కాలం కిందటే ముగిశాయి. పద్దతి ప్రకారం.. వాల్యూయేషన్ చేయకుండా… కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటల్ వాల్యూయేషన్ అంటూ.. కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. దీంతో చాలా మంది ఆశావహులు ఇంటర్యూలకు అర్హత సాధించలేకపోయారు. గ్రూప్ త్రీ పోస్టు సాధించలేని వ్యక్తులకు గ్రూప్ వన్‌లో ఇంటర్యూలకు హాజరు కావడం… అసలు పరీక్షలు ఎక్కడ రాశారో కూడా తెలియని వ్యక్తులు.. సక్సెస్ అవ్వడం వంటివి వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో.. ఏపీపీఎస్సీ వ్యవహారాలపై వివాదం ప్రారంభమయింది. చైర్మన్ ఉదయ్ భాస్కర్‌ను.. కమిషన్ లో ఎలాంటి అధికారాలు లేకపోవడంతో.. ఆయన కార్యాలయానికి రావడం లేదు. ప్రభుత్వం నియమించిన కొంత మంది సభ్యులే నడుపుతున్నారు. చైర్మన్ సభ్యుడేనని.. అంతా తమ చేతుల్లో ఉంటుందని వారు వాదిస్తున్నారు.
సలాంబాబు అనే సభ్యుడు మూడు రోజుల కిందట ప్రెస్‌మీట్ పెట్టి.. విద్యార్థులు ఆరోపిస్తున్నవి కరెక్టే కానీ… అవన్నీ అపోహలని చెప్పుకొచ్చారు. వాల్యూ చేసిన పేపర్లను బయట పెట్టాలంటే కుదరదనేశారు. ఏపీపీఎస్సీ తీరు తీవ్ర వివాదాస్పదం అవుతున్న సమయంలో ఇంటర్యూలు ఎత్తివేయడం.. చాలా మందిలో కొత్త సందేహాలు లేవనెత్తేలా చేస్తోంది. హైకోర్టు స్టే ఇచ్చిన గ్రూప్ వన్ పోస్టులకు కూడా.. ఇంటర్యూలు రద్దు చేస్తారా.. లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ప్రభుత్వం చేయాలనుకున్నదంతా చేసేసి ఆ తర్వాత వివరాలు బయట పెడుతుంది కాబట్టి.. హైకోర్టు ఇంటర్యూలపైనే స్టే ఇచ్చింది.. భర్తీపై కాదని చెప్పి.. అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేసినా ఇచ్చేస్తుందన్న అనుమానం నిరుద్యోగుల్లో కనిపిస్తోంది.