ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో నిర్మిస్తున్న ఇళ్లు కనీసం “కొత్త దంపతులు రాత్రి పూట ఏమైనా చేసుకుందామనుకున్నా” కూడా ఉపయోగపడవని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి .. నేరుగా మీడియా సమక్షంలో.. జనంతో జరిగిన మీటింగ్‌లోనే ప్రకటించారు. ఆయన మాటలు కాస్త ఎబ్బెట్టుగా ఉన్నా… జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఇళ్ల గురించి.. నేరుగా ప్రజల్లో చర్చ జరగాలంటే.. అంత కంటే గొప్ప భావ వ్యక్తికీరణ ఉండదేమో అన్నట్లుగా నల్లపురెడ్డి మాట్లాడారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పినట్లుగా కొత్త జంట శోభనం గురించి కాకుండా… ఆ ఇళ్ల దుస్థితి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలాన్ని 30 లక్షల మందికి ఇవ్వాలని సంకల్పించారు. అందులో లక్షా ఎనభై వేల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకోవాలని వరం ఇచ్చారు. ఇల్లు ఎలా ఉండాలో మోడల్ కూడా సిద్ధం చేశారు. ఆ సెంటు స్థలంలో ఓ బెడ్ రూం, హాలు, కిచెన్, బాత్రూం, వరండా ఇలా అన్నీ కలిపి.. గ్రాఫిక్స్ చేయించారు. ఆ ప్రకారం.. నిర్మించిన ఇంటిని చూస్తే.. ఇద్దరు పిల్లలు .. ఇద్దరు పెద్దలు ఉన్న ప్యామిలీలో.. అందరూ ఇంట్లో ఉండటానికి సాధ్యం కాదు. ఇద్దరు ఇంట్లో.. ఇద్దరు బయట ఉండాలి. ఇద్దరూ ఉండే ఫ్యామిలీ అయితే.. ఒకరు హాల్లో మరొకరు బెడ్ రూమ్ అనబడే గదిలో ఉండాలి. కేవలం 300 చదరపుఅడుగుల స్థలంలో హాలు,కిచెన్, బెడ్రూం ఇలా అన్నీ వచ్చే ఇల్లు కట్టాలంటే.. అంతకు మించి పెద్దవి రావు. లబ్దిదారులైన ప్రజల్లోనూ అదే అసంతృప్తి ఉంది. ప్రజలు ప్రశ్నిస్తూండే సరికి వైసీపీ నేతల్లోనూ అదే కనిపిస్తోంది.
వైసీపీ ఎమ్మెల్యేలందరిదీ అదే భావన. కానీ నోరెత్తే సాహసం ఎవరికీ లేదు. సమయం.. సందర్భం కలిసి వచ్చిందేమో కానీ… నల్లపురెడ్డి బయటపడ్డారు. ఇళ్ల నిర్మాణం విషయంలో నెగెటివ్ కామెంట్స్ చేసిన ఆయనకు సొంత పార్టీలో మైనస్ మార్కులు పడటం ఖాయం. మంత్రి పదవి కోసం … హైకమాండ్ పెద్దల్ని మొప్పించేందుకు టీడీపీ నేతల్ని బండ బూతులు తిట్టడానికి ఏ మాత్రం వెనుకాడని నల్లపురెడ్డి ఇప్పుడు ఇళ్ల నిర్మాణం విషయంలో ఎందుకు మాట జారారో .. దాని వెనుక ఏమైన వ్యూహం ఉందో తేలాల్సి ఉంది. అయితే ఆయన అన్న మాటలు మాత్రం నిజం అన్న ఏకాభిప్రాయం మాత్రం అందరిలోనూ వినిపిస్తోంది.