తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఏర్పడి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించిన రెండు అతి పెద్ద ముఖ్యమైన యూనివర్సిటీలు వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఈ రెండు కాలేజీల్లో ఉండే ఉన్నత స్థాయి ప్రమాణాలు దేశం మొత్తానికి తెలుసు. అందుకే… ఇవి రెండు అమరావతిలో క్యాంపస్‌లు పెట్టాలనుకున్నప్పుడు… పెట్టిన తర్వాత అడ్మిషన్స్ హాట్ కేకుల్లాగా అయిపోయాయి. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారు చేరారు. ఇప్పుడు ఆ క్యాంపస్‌ల నుంచి మొదటి బ్యాచ్ బయటకు వచ్చింది. వందకు వంద శాతం ప్లేస్మెంట్లతో అత్యధిక విజయాలు నమోదు చేశారు. తమ క్యాంపస్ ఘనతపై ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చింది. ఇంత వరకూ బాగానే ఉన్నా అసలు… ఆ రెండు యూనివర్శిటీల పేర్లముందు అమరావతి అనే పదమే కనిపించడం లేదు. విట్ ఆంధ్రప్రదేశ్.. ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్ అనే సంభోదిస్తున్నారు.
విట్ అయినా.. ఎస్ఆర్ఎం అయినా ఎక్కడ క్యాంపస్ ఏర్పాటు చేస్తే.. ఆ ఊరి పేరుతో క్యాంపస్‌ను నిర్వహిస్తుంది. ఉదాహరణకు.. ఎస్ఆర్ఎం చెన్నైలో ఉంటే.. ఎస్ఆర్ఎం చెన్నై.. బెంగళూరులో ఉంటే.. ఎస్ఆర్ఎం బెంగళూరు అనే సంబోధిస్తారు. అమరావతిలో క్యాంపస్‌లో ప్రారంభించిన మొదట్లో… ఎస్ఆర్ఎం అమరావతి అనే ప్రమోట్ చేశారు. అదే పద్దతిలో ప్రచారం కూడా జరిగింది. వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమరావతి. ఎస్ఆర్ఎం యూనివర్శిటీ అమరావతి భారీ సైన్ బోర్జులు కూడా గతంలో ఏర్పాటు చేశారు.
కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్నారు. భవిష్యత్‌లో ఇక ఎక్కడా ఏపీలో క్యాంపస్ పెట్టే ఆలోచన లేదన్నట్లుగా రాష్ట్రం పేరును ప్రస్తావిస్తూండటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. విట్ కూడా అంతే.. తమ పేరులో అమరావతిని తొలగించింది. ఆ రెండు సంస్థలకు నేరుగా మంత్రుల స్థాయిలో బెదిరింపులు వెళ్లాయన్న ప్రచారం జరుగుతోంది. అమరావతి తీసేసి ఆంధ్రప్రదేస్ అని పెట్టాలని.. హెచ్చరించడంతో.. వారు ప్రభుత్వంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుని.. ఆ పేర్లే పెట్టుకున్నారంటున్నారు. అతి వేగంగా అమరావతికి వచ్చినరెండు యూనివర్శిటీలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. అమరావతి అస్థిత్వాన్ని కొనసాగించి ఉంటే.. ఇప్పటికీ.. అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు వచ్చి ఉండేవి. అమరావతి మరోసారి విద్యా కేంద్రం అయి ఉండేదని అంటున్నారు.