ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని .. డబ్బులు వృధా చేస్తున్నారని తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ప్రభుత్వానికి సొంత విమానం లేకపోవడం వల్ల ఇలా ప్రత్యేక విమానాలు అద్దెలకు తీసుకుని సీఎంలు పర్యటిస్తూ ఉంటారు. సొంత విమానం కొనాలనే ఆలోచన ప్రభుత్వాలు ఇప్పటి వరకూ చేసి ఉండకపోవచ్చు.. కానీ ఏపీలో చాలా మంది పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక విమానాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా విమానం ఉన్న పారిశ్రామికవేత్తల జాబితాలోకి సీఎం రమేష్ చేరారు.
టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన .. గత ఎన్నికల్లో టీడీపీ బోల్తా కొట్టడంతో బీజేపీలో చేరిపోయారు. అప్పట్నుంచి బీజేపీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆయనకు బాగా కలిసొచ్చినట్లుగా ఉంది. సొంత విమానం కొనేశారు. విమానానికి కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేశారు. కొంత మంది సన్నిహితులతో తొలి సారి ప్రయాణం కూడా చేశారు. నిజానికి టీడీపీ ఓడిపోయిన తర్వాత సీఎం రమేష్‌కు చెందిన కాంట్రాక్టులన్నింటినీ ఏపీ సర్కార్ రద్దు చేసి.. రివర్స్ టెండరింగ్‌లో తమ పార్టీ వారికి కేటాయించింది. అయినా సీఎం రమేష్ పెద్దగా నిరాశపడలేదు.
ఆయనకు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్.. దేశంలోఇతర చోట్ల పెద్ద ఎత్తున కాంట్రాక్టులు చేస్తోంది. చేరింది బీజేపీలోనే కావడంతో వాటికి ఇ్బబంది లేనట్లుగా ఉంది. ఆయన డబ్బులు బాగానే వెనుకేసుకుంటున్నారని.. దాాదపుగా రెండు వందల కోట్లు పెట్టి.. ప్రత్యేక విమానం కొనుగోలు చేశారంటే.. పార్టీ మారి మంచి నిర్ణయమే తీసుకున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పార్టీ మారిన టీడీపీ ఎంపీలు ముగ్గురూ పారిశ్రామికవేత్తలే. మిగతా ఇద్దరు టీజీ వెంకటేష్.. సుజనా చౌదరి. వారు కూడా విమానాలు కొనగలిగే స్థితికి వెళ్లారో లేదో మరి..!