సినిమా.. ఓ పరిశ్రమ. దేశం మొత్తం మీద.. ప్రతీ యేటా వేయికి పైగా చిత్రాలు నిర్మితమవుతాయి. లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చిత్రసీమపై ఆధారపడి బతుకుతుంటారు. ప్రభుత్వానికీ ఓరకంగా అతి పెద్ద ఆదాయ మార్గం. అయితే… చిత్రసీమలో ఎన్నో వ్యధలు. కన్నీళ్ల కథలు. ఎన్నో వ్యయ ప్రయాసలకూర్చి ఓసినిమా నిర్మిస్తే.. అది విడుదల అవుతుందో, లేదో చెప్పలేం. చిన్న సినిమాలకు ఈ పరిస్థితి తరచూ ఎదురవుతూనే ఉంటుంది. టాలీవుడ్ లోనే చూడండి. ఏటా.. మూడొందలకు పైగా చిత్రాలు నిర్మితమైతే అందులో కనీసం 20 శాతం సినిమాలు విడుదలకు నోచుకోవు. థియేటర్లు దొరక్క, వ్యాపారం జరక్క. లాబుల్లోనే మగ్గిపోయే సినిమాలెన్నో. ఓ సినిమా విడుదల ఆగిపోతే.. సదరు నిర్మాతకు కోట్లలో నష్టం వస్తుంది. తెలుగులోనే కాదు, అన్ని భాషల్లోనూ ఇదే సమస్య.
ఈ సమస్యకు కోలీవుడ్ ఓ పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తోంది. తమిళ సినీ నిర్మాతల మండలి ఈ రోజు ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. 2015 నుంచి ఇప్పటి వరకూ.. షూటింగ్ పూర్తయి, విడుదల కాని సినిమాల జాబితాను సేకరిస్తోంది. కొన్ని సినిమాలు నిర్మాణానంతర కార్యక్రమాలు సైతం పూర్తవ్వకముందే ఆగిపోతుంటాయి. అలాంటి సినిమాల జాబితానీ సిద్ధం చేస్తోంది. తమిళ నిర్మాతల మండలి ఆధ్వర్యంలో ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని స్థాపించాలన్నది ప్రయత్నం. ఆ ఓటీటీ ద్వారా ఈ సినిమాలన్నీ విడుదల చేస్తారు. ఆయా సినిమాల వల్ల వచ్చిన ఆదాయం మొత్తం ఆ నిర్మాతలకే చెందేలా ప్రణాళికలు, ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. నిజానికి ఇదో మంచి నిర్ణయం. చిన్న సినిమాలకు చేయూత నిచ్చే ఆలోచన. తెలుగులోనే కాదు.. అన్ని భాషల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరగాలి. ఎందుకంటే ఇప్పుడున్నపరిస్థితుల్లో సినిమాని ఓటీటీలకు అమ్ముకోవడం కూడా కష్టం అవుతోంది. పేరున్న నటీనటులు ఉన్న సినిమాలకే ఓటీటీలు పెద్ద పీట వేస్తున్నాయి. దాంతో చిన్న సినిమాలకు అక్కడ కూడా గిరాకీ ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతల మండలే ఓ ఓటీటీ సంస్థని ఏర్పాటు చేయడం, అందులో చిన్న సినిమాలనే తీసుకోవడం, ఆ లాభాలన్నీ నిర్మాతలకే దక్కడం ఓ మంచి ఆలోచన. చూద్దాం. ఈ ప్రయత్నం ఎంత వరకూ సఫలీకృతం అవుతుందో?