మా ఎన్నికల బరిలోకి అయిదవ అభ్యర్థిగా సి వి ఎల్ నరసింహారావు నిన్న రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. మొదటి నలుగురు అభ్యర్థులకు భిన్నంగా తెలంగాణ వాదాన్ని ఈయన ప్రస్తావించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తాజాగా నటి మరియు రాజకీయ నాయకురాలు విజయశాంతి “మా” ఎన్నికలలో తెలంగాణ వాదం ప్రకటించిన నరసింహారావు కి తన మద్దతు పలికింది. వివరాల్లోకి వెళితే..
ప్రకాష్ రాజ్, విష్ణు, జీవిత మరియు హేమ ఈ సారి మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తామని గతంలోనే ప్రకటించి ఉన్నారు. అయితే లాయర్ పాత్రల తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నరసింహారావు తను కూడా ఈసారి బరిలో ఉన్నానని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తానని , తన ప్యానల్ తెలంగాణవాదం అని, సినిమా అవకాశాలలో తెలుగు వారికి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన ప్రకటించారు. అయితే అనుకోని వైపు నుండి ఆయనకు మద్దతు లభించింది. నటి మరియు రాజకీయ నాయకురాలు అయిన విజయశాంతి ఆయనకు మద్దతు పలికారు. ”మా” ఎన్నికల పై సీవీయల్ నరసింహా రావు అవేదన న్యాయమైనది, ధర్మమైంది. నేను మా సభ్యురాలినీ కాకపోయినా ఒక కళాకారిణి గా స్పందిస్తున్న..చిన్న కళాకారుల సంక్షేమం దృష్టా సీవీయల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్న…” అని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఫిల్మ్ నగర్ లో మరో గాసిప్ చక్కర్లు కొడుతోంది. ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, ఆయన కి ప్రత్యర్థి గా పోటీ చేస్తున్న మంచు విష్ణు, జీవిత లు ఆయన స్థానికేతరులు అన్న అంశాన్ని బలంగా హైలెట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు నరసింహారావు తెలంగాణవాదం తలకెత్తుకోవడం తో, మిగతా వారు తెలంగాణేతరులు కావడంతో, ప్రకాష్ రాజ్ ని స్థానికేతరులు అన్న కోణంలో టార్గెట్ చేస్తే, తాము కూడా తెలంగాణ వాదం తో టార్గెట్ అవుతారు కాబట్టి స్థానికత అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.