ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ విధి నిర్వహణలో రాజకీయ ఎజెండా అమలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఆయనపై రాజకీయాలతో సంబంధం లేని.. వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. గతంలో హిందూ మతాన్ని కించ పరుస్తూ ఆయన మాట్లాడిన మాటలపై వీడియోలతో సహా కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా ఉగ్రవాదులను సమర్థిస్తూ.. ఆయనకు చెందిన సంస్థ .. భావజాలాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపిస్తూ.. కొన్ని వీడియోలతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టీడీపీ నేత వర్ల ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులోని అంశాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
” వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను అల్‌ఖైదా వాళ్లు కూల్చి వేశారు. వారికి ఉన్నంత నిబ్దద్దతను మనం ఆదర్శంగా తీసుకోవాలి..” ఇది అడిషనల్ ఎస్పీగా ఉన్న మోకా సత్తిబాబు అనే అధికారి.. యువతను సమీకరించి నిర్వహించిన ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. ఆయన వెనుకను సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ ఉన్నారు. యువతను రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యల వీడియోను ఇప్పుడు.. టీడీపీ నేతలు ఫిర్యాదులు చేయడానికి సాక్ష్యంగా ఉపయోగించుకుంటున్నారు. మోకా సత్తిబాబుతో పాటు.. ఏడీజీ సునీల్ కుమార్ కూడా.. ఉగ్రవాదులకు మద్దతిచ్చేలా.. యువతరాన్ని ఆ వైపు మళ్లించేలా.. వ్యవహరిస్తున్నారని.. తక్షణం వారిపై దేశద్రోహం కేసు పెట్టాలని వర్ల రామయ్య డిమాండ్ చేస్తున్నారు. మొదట ఆయన గవర్నర్‌తో పాటు డీజీపీకి ఫిర్యాదు చేశారు. స్పందన రాకపోవడంతో రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
సీనియర్ ఐపీఎస్‌గా ఉంటూ.. పీవీ సునీల్ కుమార్ ఓ సంస్థను నెలకొల్పారు.ఆ సంస్థ బాధ్యతను మోకా సత్తిబాబు అనే అధికారి కూడా చూస్తూంటారు. ఈ సంస్థ యువతతో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది.ఆ సమావేశాల్లో వీరు ప్రసంగిస్తూ ఉంటారు. ఆ ప్రసంగాల్లో వివాదాస్పద అంశాలు ఉంటున్నాయి. దీంతో వర్ల రామయ్య ఆ వీడియోలు సేకరించికేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఏఐఎమ్ అనే సంస్థ ద్వారా భారతీయ సంస్కృతిని కించపరుస్తూ ఉగ్రవాదులను ఆదర్శంగా చూపిస్తున్నారు. కాబట్టి సివిల్ కాండక్ట్ రూల్స్ ను ఉల్లంఘించిన ఈ ఇద్దరు అధికారులపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు. భారత శిక్షాస్మృతి 124(A)ప్రకారం వీరిపై రాజద్రోహ నేరం కేసు రిజిస్టర్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వర్ల కోరుతున్నారు.
వర్లరామయ్య పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం కూడా స్పందించకపోతే… ఆయన కోర్టున ఆశ్రయించాలని అనుకుంటున్నారు. సీఐడీ సునీల్‌పై ఇప్పటికే అత్యున్నత స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. వెళ్లిన ప్రతీ ఫిర్యాదును పక్కన పడేసే అవకాశం ఉండదు. పరిశీలించి.. చర్యలు తీసుకుంటారు. ఏపీలోనూ ఐపీఎస్ వర్గాల్లో ఇలాంటి వాటికి ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటేనే మిగతా వారు దారిలో ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది.