అదేంటో తెలీదు గానీ, ఈమధ్య తమిళ హీరోలంతా టాలీవుడ్ పై ప్రేమగా పగబట్టారు. తెలుగులో నేరుగా సినిమాలు చేయడానికి రంగం సిద్ధంచేసుకుంటున్నారు. విజయ్ తొలి అడుగు వేస్తే.. ఆ వెంటనే ధనుష్… ఏకంగా పరుగే అందుకున్నాడు. వరుసగా రెండు సినిమాలకు ఓకే చెప్పాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పుడు వెంకీ అట్లూరి కూడా ధనుష్ కి కథ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అంటే… ధనుష్ చేతిలో రెండు సినిమాలున్నాయన్నమాట. అంతటితో ఆగడం లేదు. `సాహో` దర్శకుడు సుజిత్ కూడా ధనుష్ కోసం ఓ కథ సిద్ధం చేశాడని ప్రచారం మొదలైంది. ఈ దెబ్బతో.. ధనుష్ చేతికి మూడో సినిమా చేరిపోయినట్టే. వరుసగా మూడు సినిమాలు అంటే.. కనీసం రెండేళ్ల పాటు టాలీవుడ్ లోనే ఉంటాడు ధనుష్. విచిత్రం ఏమిటంటే.. ధనుష్ సినిమాలేవీ తెలుగులో సరిగా ఆడలేదు. తమిళంలో హిట్టయిన సినిమాల్ని.. తెలుగులో రీమేక్ చేసుకోవడానికి (నారప్ప లాంటివి) ప్రయత్నిస్తున్నారంతే. ధనుష్ డబ్బింగ్ సినిమాల్నీ తెలుగులో ఫట్టే. కనీసం విశాల్ కి వచ్చిన ఓపెనింగ్స్ కూడా ధనుష్ సినిమాలకు రాలేదు. అయినా.. అంత క్రేజ్ ఏమిటో?