సినిమాకి లెంగ్త్ చాలా అవసరం. సినిమా ఎంత బాగా వస్తున్నా.. ఆ లెంగ్త్ దాటకూడదు. ప్రేక్షకుల సహనం, ఓపిక.. ఇవి రెండూ దృష్టిలో ఉంచుకుని సినిమాని ట్రిమ్ చేయాల్సిందే. అందుకే.. మంచి సీన్లు కూడా… లెంగ్త్ లో ఇమడక `కట్` అయిపోతుంటాయి. ఆ బాధ్యతని ఎడిటర్ తన భుజాన వేసుకుంటాడు. ఒక్కోసారి దర్శకులు ధైర్యం చేసి మూడు గంటల సినిమాల్ని కూడా విడుదల చేస్తుంటారు. నిడివి భారమై, సినిమాల ఫలితాలు తేడా వచ్చిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. ఇది వరకు మూడు గంటల సినిమాని ఈజీగా చూసేసేవారు. ఆ తరవాత రెండున్నరకు కదించారు. ఇప్పుడు 2 గంటల సినిమానే నయం అనుకుంటున్నారు. నిడివి తక్కువయ్యే కొద్దీ… బడ్జెట్ కలిసివస్తుందన్నది నిర్మాతల ఆలోచన. అందుకే.. ఆరు పాటలుండాల్సిందే అనే నియమాలేం పెట్టుకోవడం లేదు. పాటల్ని సైతం కుదించి – ప్రేక్షకులపై భారాన్ని తగ్గిస్తున్నారు.
కొంతమంది దర్శకులకు కంట్రోల్ ఉండదు. సీన్లుపై సీన్లు తీస్తూనే ఉంటారు. ఉదాహరణకు శేఖర్ కమ్ములనే తీసుకుందాం. ఆయన సినిమాల్నీ ఫుటేజీ బరువుని మోసినవే. ఆయన సినిమాల్ని `కట్` చేయడం ఎడిటర్లకు చాలా భారం. ప్రతీ సన్నివేశం సహజంగా ఉండడానికి లెంగ్త్ ని ఎక్కువ తీసుకోవడం మరో సమస్య. సుకుమార్ కూడా అంతే. ఆయన `తీస్తూనే…..` ఉంటారని సహాయకులు చెబుతుంటారు. చివరికి ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఎలా కత్తిరించాలో తెలీక ఆపపోపాలు పడుతుంటారు.
అయితే ఇప్పుడు వీటన్నింటికీ పరిష్కార మార్గం దొరికేసింది. సినిమా లెంగ్త్ ఎంత ఎక్కువైతే అంత మంచిది అనుకుంటున్నారు. `లెంగ్త్ ఎక్కువైనా ఫర్లేదు. కావాలంటే రెండు భాగాలుగా విడుదల చేద్దాం` అనే కొత్త ఫార్ములా కనిపెట్టారు మనవాళ్లు. ఫుటేజీ నాలుగు గంటలు వస్తే చాలు. మరో పావుగంటో, అరగంటో కలిపి రెండు భాగాలు చేస్తే – డబుల్ లాభాలు అనే దృక్పథానికి వచ్చేశారు. బాహుబలితో ఈ అంకం మొదలైంది. నిజానికి బాహుబలి 2 చేయాలన్న ఆలోచన కథ రాసుకున్నప్పుడు లేదు. కథ విస్తరిస్తు్న్న కొద్దీ.. పార్ట్ 2 చేయాలన్న కోరిక బలపడింది. అదే ఆ సినిమాకి భారీ లాభాలు కట్టబెట్టింది.
ఎన్టీఆర్ బయోపిక్ కూడా రెండు భాగాలుగా వచ్చింది. ఎన్టీఆర్ జీవితం విస్తారమైనది. సినిమాలూ, రాజకీయాలూ అంటూ చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే రెండు భాగాలుగా చేశారు. `పుష్ష`నే తీసుకోండి. రెండు భాగాలన్న ఆలోచన.. షూటింగ్ క్రమంలో వచ్చిందే. ఫుటేజీ పెరిగిపోతోంటే.. కుదించే బదులు, పార్ట్ 2 గా తీస్తే బాగుంటుందని ఫిక్సయ్యారు. ఆచరణలో పెట్టేశారు. ఇప్పుడు కల్యాణ్ రామ్ `బింబిసార` కూడా రెండు భాగాలుగా రాబోతోందని ప్రచారం జరుగుతోంది. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ఇది కూడా ఫుటేజీ పెరగడం వల్ల.. తీసుకున్న నిర్ణయం ఇది.
పార్ట్ 2 అంటే – ఎంత లాభదాయకమో.. అంత రిస్క్ కూడా. ఎందుకంటే.. పార్ట్ 1 విజయవంతమైతేనే. పార్ట్ 2పై అంచనాలు ఏర్పడతాయి. రెండో భాగం చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. బాహుబలిలో కట్టప్ప వెన్నుపోటు పార్ట్ 2 చూడడానికి ప్రేరణ కలిగించింది. ఆ సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది. అన్నిసార్లూ ఈ ఫీట్ సాధ్యం కాకపోవొచ్చు. ఎన్టీఆర్ రెండు భాగాలుగా తీయడం వల్ల నష్టమే ఏర్పడింది. ఆ బయోపిక్ ఒకే భాగంగా వస్తే బాగుండేది అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. పుష్ష విషయంలో ఏం జరుగుతుందన్నది చూడాలి. ఒకవేళ ఈ సీజన్ లో రాబోతున్న పార్ట్ 2 చిత్రాల్లో ఒకటి హిట్ అయినా… తప్పకుండా ఇదో ఫార్ములాలా మారిపోయే అవకాశం ఉంది.