తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేసినా, థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు లభించినా, ఇప్పటి వరకూ.. చిత్రసీమ నుంచి ఎలాంటి కదలికా లేదు. దానికి కారణం.. ఏపీలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. లాక్ డౌన్ నిబంధనలు ఇంకా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర.. రెండింటిలోనూ పరిస్థితులు చక్కబడినప్పుడే థియేటర్లు తెరచుకోవడం జరుగుతుంది. అప్పుడే కొత్త సినిమాల రాక ఉంటుంది. అయితే థియేటర్లు తెరచుకున్నా, ఇప్పట్లో కొత్త సినిమాలు వచ్చే అవకాశాలు ఉండకపోవొచ్చు. జులై చివరి వారంలో గానీ, ఆగస్టులో గానీ సినిమాల హడావుడి మొదలు కావొచ్చు. ఇప్పటికీ.. థియేటర్లలో సినిమా విడుదల చేయడం రిస్కనే భావిస్తున్నారు నిర్మాతలు. అందుకే ఓటీటీ బేరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటే.. ఓటీటీ వైపు మళ్లే సినిమాల సంఖ్య పుష్కలంగా ఉండొచ్చన్నది ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.
అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`, నిఖిల్ `18 పేజీస్` రెండూ.. ఓటీటీలో విడుదల కావొచ్చన్నది లేటెస్ట్ టాక్. ఈ రెండు చిత్రాల్ని గీతా ఆర్ట్స్ 2 సంస్థ నిర్మించింది. బన్నీ వాసు నిర్మాత. ఆయన మాట్లాడుతూ “పరిస్థితులు ఇంకా చక్కబడలేదనే భావిస్తున్నాం. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఆడియన్స్‌కి థియేటర్ కి వచ్చే మూడ్ ఉందో, లేదో ఇప్పుడే అంచనా వేయలేం. ఓటీటీ ఆఫర్లు బాగా వస్తే.. తప్పకుండా ఆ దిశగా ఆలోచిస్తాం“ అని చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ చేతిలో `ఆహా` ఉంది. వెళ్తే.. ఈ రెండు సినిమాలూ.. ఆహాకే వెళ్లొచ్చు. ఆమేజాన్ నుంచి ఈ రెండు సినిమాలకూ ఓ ప్యాకేజీ లా ఆఫర్ వస్తే… లాభసాటిగా అనిపిస్తే అక్కడికి వెళ్లొచ్చు. మొత్తానికి ఈ రెండు సినిమాల్నీ బల్క్‌గా అమ్మేయాలని బన్నీ వాసు భావిస్తున్నట్టు తెలుస్తోంది.