తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒంటరయ్యారు. ఆయన ప్రకటన తర్వాత రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న వారంతా బయటకు వస్తారని అంచనా వేశారు. కానీ.. ఎవరూ బయటకు రాలేదు. చివరికి ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా.. రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రకటన చేశారు. గతంలో ఎన్నడూ లేనంత పకడ్బందీగా.. కింది స్థాయి నుంచి క్యాడర్ అభిప్రాయం తీసుకుని రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటించారని.. రాజగోపాల్ రెడ్డి ప్రకటన చేయడం.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరో వైపు రేవంత్ రెడ్డి తన నియామకంపై అసంతృప్తితో ఉన్న సీనియర్లందరినీ కలుస్తున్నారు.
కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరిన వీహెచ్‌ను ప్రత్యేకంగా వెళ్లి పలకరించారు. నిజానికి రేవంత్ పై వీహెచ్ విరుచుకుపడుతున్నారు. ఆయనకు పదవి వద్దే వద్దని అంటున్నారు. కానీ.. ఆయనకే పదవి వచ్చింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడంతో ఆయన కూల్ అయ్యారు. కలిసి పని చేద్దామని చెప్పారు. రేవంత్ నియామకం పట్ల.. టీ కాంగ్రెస్‌లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. అతి కొద్ది మంది సీనియర్లు తప్ప.. మిగతా వారందరూ స్వాగతిస్తున్నారు.
అయితే సీనియర్లు మాత్రం ఎలాంటి స్వాగత ప్రకటనలు చేయలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం కొత్త కమిటీకి శుభాకాంక్షలు చెప్పారు. భట్టి, శ్రీధర్ బాబు సహా పలువురు ఇంకా స్పందించలేదు. అయితే వారికి అసంతృప్తిగా ఉన్నా… కోమటిరెడ్డిలా వివాదాస్పద ప్రకటనలు చేసే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. కోమటిరెడ్డి చివరికి సోదరుడి మద్దతు కూడా కూడగట్టుకోలేకపోవడంతో ఆయన టీ కాంగ్రెస్‌లో ఒంటరైనట్లేనని భావిస్తున్నారు.