వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై టీఆర్ఎస్ మంత్రులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు.. దారుణమైన దుర్భాషలు ఆడుతున్నారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అయితే మానవ బాంబులమవుతామని హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇంత జరుగుతున్నా.. ఏపీ వైపు నుంచి అసలు స్పందనే లేదు. తమ పార్టీ మూల పురుషుడ్ని.. ఇంకా చెప్పాలంటే.. తమ ముఖ్యమంత్రి తండ్రిని అంత దారుణంగా తిట్టి కించ పరుస్తూంటే.. ఖండించాల్సిన నేతలు… ప్లీజ్ ప్లీజ్.. అలా చనిపోయినవారిని తిట్టడం భావ్యం కాదు అంటూ.. బతిమాలుతున్న ధోరణిలో ప్రకటనలు చేస్తున్నారు. టీడీపీని బండ బూతులు తిట్టడంలో వైసీపీలో స్పెషలిస్టులుగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని, అనిల్ కుమార్ ఇద్దరూ.. అత్యంత సంయమనం పాటిస్తున్నారు.
ఇద్దరూ వారు మాట్లాడినట్లుగా మేమూ మాట్లాడగమని చెబుతున్నారు కానీ.. మాట్లాడబోమని అంటున్నారు. కేసీఆర్‌ను వైఎస్‌ను విమర్శించినట్లుగా విమర్శిస్తే.. ఏదో అయిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే.. వైసీపీలో ఎవరైనా.. హైకమాండ్ చెబితేనే మాట్లాడాలి. వారు మాట్లాడమన్నదే మాట్లాడాలి. అందుకే.. వైసీపీలో నేతలు హైకమాండ్ ఆదేశం లేకుండా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. సీఎం జగన్ దృష్టికి తెంలగాణ మంత్రుల ప్రకటనలు వెళ్తున్నాయో లేదో కానీ.. ఆయన వైపు నుంచి స్పందన లేదు. కనీసం సలహాదారు సజ్జల అయినా స్పందించాల్సి ఉంది. కానీ.. అనవసరంగా రెచ్చిపోమంటూ ఆయన .. తమ విధానాన్ని చెప్పేశారు.
వైసీపీ బలహీనత అర్థం చేసుకున్న టీఆర్ఎస్ నేతలు.. మరింత దూకుడుగా వెళ్తున్నారు. వైసీపీ స్పందన సరిగ్గా లేకపోవడంతో.. వైఎస్ అభిమానులతో పాటు… సాధారణ కార్యకర్తల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది. వైఎస్‌ను బూతులు తిడుతున్నా కౌంటర్ ఇవ్వకపోతే.. తమను మరో రకంగా అనుకంటారని.. లీడర్లు గట్టి కౌంటర్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ హైకమాండ్ మాత్రం.. టీఆర్ఎస్ మాత్రం.. ఇష్టమైన వాళ్లు తిట్టినా పడటంలో తప్పు లేదన్నట్లుగా ఉంటూడటంతో.. వైసీపీ కింది స్థాయి కార్యకర్తలకు ఇజ్జత్ సమస్య వచ్చి పడుతోంది.