రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. తనకు ఐదు లక్షల జీతం వస్తుందని.. అందులో రెండు లక్షల డెభ్బై వేల రూపాయలు ప్రభుత్వానికే పన్నుల రూపంలో కడుతున్నానని చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తరప్రదేశ్లోని స్వగ్రామంలో పర్యటిస్తున్నారు. అక్కడ అయన ప్రజల బాధ్యతల్ని గుర్తు చేస్తూ.. పన్ను కట్టాలని పిలుపునిచ్చారు. పన్నులు కడితేనే.. అభివృద్ధికి నిధులు వస్తాయన్నారు. ఆ క్రమంలో తాను ఐదు లక్షలు సంపాదిస్తూంటే… రెండు లక్షల 70వేలు పన్నులకే పోతున్నాయని.. తన కంటే టీచర్లు ఎక్కువగా సేవింగ్స్ చేసుకుంటారని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. నిజంగా నెలకు ఐదు లక్షలు కష్టపడి సంపాదించుకునేవారి దగ్గర ప్రభుత్వం సగానికి సగం… పన్నుల రూపంలో బాదేస్తోందన్నమాట.
రాష్ట్రపతి మాటలతో ఈ క్లారిటీ వచ్చింది. అంత వరకూ ఓకే కానీ.. అసలు రాష్ట్రపతి అబద్దాలు చెబుతున్నారని.. కొంత మంది లా పాయింట్ బయటకు తీశారు. చట్టం ప్రకారం… రాష్ట్రపతి జీతానికి ఎలాంటి పన్నులు విధించరు. ఆయన జీతానికి పూర్తి స్థాయి పన్ను మినహాయింపు ఉంటుంది. అలాంటప్పుడు.. ఆయన ఒక్క పైసా పన్ను కూడా కట్టడానికి అవకాశం లేదు. కట్టినా ప్రభుత్వం తీసుకోదు. మరి రాష్ట్రపతి అబద్దం చెప్పారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
దేశంలో పన్ను స్వామ్యం పెరిగిపోయిందని.. వస్తున్న విమర్శల నేపధ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు మరింత వైరల్ అవుతున్నాయి. ఓ వైపు … పెట్రోల్, డీజిల్ మీద పన్నుతో… అన్ని రకాల ధరలు పెరుగుతున్నాయి.. వాటిపై జీఎస్టీ లు వసూలు చేస్తూ… ప్రజల ఆదాయం ఇరవై శాతం వరకూ ప్రభుత్వమే వసూలు చేస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు పన్నులు కట్టే మధ్యతరగతి ప్రజల్లో కొత్త చర్చలకు కారణం అవుతున్నాయి.