” హైదరాబాద్‌లో ఇళ్లు, వ్యాపారాలు ఉన్నాయి. మంచిగా మాట్లాడాలి. ఇక్కడ తిని అక్కడ మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇక్కడ ప్రజలకు కోపం వస్తే ఆగమైపోతారు..” అంటూ తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొడాలి నానికి నేరుగా హెచ్చరికలు పంపించారు. ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకూ అదే వార్నింగ్ ఇచ్చారు. ఇంతరూ వీరేం చేశారంటే… వైఎస్‌ను తిట్టిన టీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. అయితే వారు ప్రజాస్వామ్య బద్ధమైన విమర్శలే చేశారు. తమ సహజమైన లాంగ్వేజ్‌ను పక్కన పెట్టి.. సాత్వికంగా ప్రకటనలు చేశారు. అయినా సరే శ్రీనివాస్ గౌడ్‌కు నచ్చలేదు. సంగతి తేలుస్తాం బిడ్డా అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చేశారు.
వైసీపీలో ఉన్న మెజార్టీ మంత్రులు.. రాజకీయ నేతలందరికీ హైదరాబాద్‌లో ఇళ్లు ఉన్నాయి. అత్యధికుల స్థిర నివాసం హైదరాబాదే. కొడాలి నాని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు…ఐదేళ్లలో నాలుగేళ్లు హైదరాబాద్‌లోనే ఉంటారు. అక్కడే వ్యాపారాలు చేస్తున్నారు. మిగతా వారిదీ అదే పరిస్థితి. ఇక సీఎం జగన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఆర్థిక మూలాలన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి. తెలంగాణ సర్కార్‌తో లడాయి పెట్టుకుంటే… కేసీఆర్ కన్నెర్ర చేస్తే.. తట్టుకోవడం కష్టమవుతుంది. అందుకే ఆయన సైలెంటవుతున్నారని అంటున్నారు. వీరి బలహీనతలు తెలుసు కాబట్టే… టీఆర్ఎస్ మంత్రులు.. ఎక్కువ.. తక్కువ మాట్లాడితే ఆస్తులపై గురి పెడతామని అంటున్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నికో… మరొకటో కానీ.. ప్రస్తుతం ఏపీ మంత్రుల్ని.. వైఎస్‌ని ఎంత ఎక్కువ తిడితే.. అంత ఎక్కువ సెంటిమెంట్ వస్తుందని.. వైసీపీ నేతలు అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా వైఎస్‌పై దుర్భాషలు ఆడుతున్నారు. ఇష్టమైన వాడు పిత్తినా సువాసనేనన్న ఓ నాటు సామెతను… వైసీపీ నేతలు గుర్తుచేస్తూ.. వటీఆర్ఎస్ నేతలు విమర్శించినా.. తిట్టినా… తమకు సమ్మతమేనని.. తాము రెచ్చిపోబోమంటూ సూక్తిముక్తావళి వినిపిస్తున్నారు. వీరి చేతకాని తనాన్ని శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు మరింతఅలుసుగా తీసుకుని ఇళ్లు, వ్యాపారాలను చూపించి.. బెదిరించడం ప్రారంభించారు.