యాక్షన్ కింగ్ అర్జున్‌లో చాలా కళలున్నాయి. మంచి నటుడే కాదు. తనలో ఓ దర్శకుడు, నిర్మాత, ఫైటర్ ఉన్నారు. దక్షిణాదని అన్ని భాషల్లోనూ సినిమాలు చేశాడు. తెలియని విషయం ఏమిటంటే… తాను పరమ భక్తుడు. ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. ఆ ప్రేమతోనే చెన్నైలో ఓ గుడి నిర్మిస్తున్నాడు అర్జున్. చెన్నై ఎయిర్ పోర్ట్‌కి దగ్గరలోనే అర్జున్ ఇల్లు ఉంది. తన ఇంటి ఆవరణలోని సొంత స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ గుడికి సంబంధించిన అన్ని పనులూ తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. కొన్ని శిల్పాల్ని కూడా అర్జున్ తన స్వహస్తాలతో చెక్కాడు. ఎన్నో ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ ఆలయం ఇప్పుడు పూర్తయింది. జులై 1న ఆలయ కుంబాభిషేక మహోత్సవం జరగబోతోంది. ఈ విషయాన్ని అర్జున్ సోషల్ మీడియా ద్వారా తెలియపరిచారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా చేయాలనుకున్నానని, కానీ కరోనా పరిస్థితుల దృష్టిలో ఉంచుకుని, ఎవరినీ ఆహ్వానించడం లేదని తెలియజేశారు.