ఇప్పుడు రాజకీయం అంటే అధికారం అందక ముందు ప్రజలకు ఉచితాల హామీలు ప్రకటించడం.. అధికారం అందిన తర్వాత పన్నులు బాదేసి… అప్పులు చేసేసి.. ప్రత్యర్థుల్ని వేధించడం. అధికారం అందిన తర్వాత ఏం చేస్తారో కానీ.. ముందుగా పంజాబ్ ప్రజలకు ఉచితాల వల వేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్. త్వరలో పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే.. బెంచ్ మార్క్ పథకాన్ని ప్రకటించేశారు. అదేమిటంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ ఇంటికి నెలకు మూడు వందల యూనిట్ల కరెంట్ ఉచితమట. అర్హులైన వారికి మాత్రమే కాదు.. ప్రజలు అందరూ అర్హులేనట. కేజ్రీవాల్ ప్రకటన ఇప్పుడు పంజాబ్లో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ ఎక్కువ రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాయి. ఇప్పుడు దాన్ని ఇళ్లకూ విస్తరింప చేస్తున్నారు కేజ్రీవాల్.
పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత పట్టుంది. నిజానికి కేజ్రీవాల్ పార్టీ పెట్టిన మొదట్లో.. ఆమ్ ఆద్మీ కి అక్కడ బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చింది. అధికారంలోకి వచ్చేస్తుందేమో అనుకున్నారు. ఎంపీల్ని కూడా గెలుచుకున్నారు. కానీ తర్వాత ఢిల్లీలో వేసిన తప్పటడుగులతో.. కేజ్రీవాల్ పంజాబ్లో క్రమంగా పట్టు కోల్పోయారు. కానీ ఇప్పటికీ మంచి ఓటు బ్యాంక్ ఉంది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆపార్టీనే బలంగా ఉంది. ఎప్పుడూ కలిసి పోటీ చేసే అకాలీదళ్ – బీజేపీ విడిపోయాయి. వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత.. ఆ పార్టీలకు ఓటు వేసే పరిస్థితి లేకుండా చేసింది.ఇక ప్రత్యామ్నాయంగా తామే ఎదగాలనుకుంటున్న కేజ్రీవాల్ ఉచిత కరెంట్ పాచిక విసిరినట్లుగా అర్థమవుతోంది.
రాజకీయాల్లో ఒక్క పథకం ఐడియా పార్టీని అధికారంలోకి తెస్తుంది. దక్షిణాదిలో అదీ మరీ ఎక్కువ. రుణమాఫీ హామీ కొన్నాళ్లు నడిచింది. నగదు బదిలీ పథకాలు ఇప్పుడు నడుస్తున్నాయి. దక్షిణాది పార్టీలకు ఇప్పుడు కేజ్రీవాల్ మరో ఐడియా ఇచ్చారు. ఇళ్లకూ ఉచిత కరెంట్ అనే హామీ ఇస్తే.. ఇక ఓట్ల పండగే పండగ రావొచ్చు. నిజానికి సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా .. ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుందని.. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడదని.. ఉచిత హామీలకు దూరంగా ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అదంతా ఉత్తదేనని.. కేజ్రీవాల్ పంజాబ్లో రాజకీయంతో నిరూపిస్తున్నారు.