ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రైవేటు ఆస్పత్రులపై మరోసారి ప్రధానికి ఫిర్యాదు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు తమకు కేటాయించిన వ్యాక్సిన్లను సక్రమంగా వినియోగించడం లేదని గుర్తించామని… అందుకే.. ఆ వ్యాక్సిన్లన్నింటినీ రాష్ట్రానికి కేటాయించాలని ప్రత్యేకంగా లేఖ రాశారు. ఉచిత టీకాలను సరఫరా చేయాలని నిర్ణయం తీసుకోవడాన్ని ముందుగా లేఖలో అభినందించిన సీఎం జగన్… తర్వాత ఏపీ సర్కార్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ల రికార్డులను వివరించారు. ఆ తర్వాత ఇక ప్రైవేటు ఆస్పత్రులపై ఫిర్యాదులు అందుకున్నారు. టీకా సంస్థలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లలో ఇరవై ఐదు శాతం ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయిస్తున్నారని.. అయితే ప్రైవేటు ఆస్పత్రలు తమకు కేటాయించిన డోస్‌లలో పది శాతం కూడా.. పేషంట్లకు వేయడం లేదని ఆయన లెక్కలతో సహా చెప్పారు.
ఏపీలో ప్రైవేటు ఆస్పత్రులకు 17 లక్షల 70వేల డోసులు కేటాయిస్తే.. వారు కేవలం రెండున్నర లక్షల మందికే వేశారని ప్రధానికి చెప్పారు. మిగతా డోసులన్నీ వృధాగా ఉన్నాయన్నారు. దీనికి పరిష్కారంగా.. ప్రైవేటు ఆస్పత్రులకు నేరుగా ఇవ్వకుండా.. ప్రభుత్వం ద్వారానే వారికి అవసరమైనన్ని మాత్రం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ప్రధానికి జగన్ సలహా ఇచ్చారు. కేబినెట్ సెక్రటరీతో జరిగిన సమీక్షా సమావేశంలో మిగతా రాష్ట్రాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయని.. ప్రధానికి గుర్తు చేశారు.
తక్షణం జోక్యం చేసుకుని.. ప్రైవేటు ఆస్పత్రులకు టీకాలు అందించే విధానంపై పునః సమీక్షించాలని జగన్ కోరారు. గతంలోనూ.. ప్రైవేటు ఆస్పత్రులపై జగన్ ఆరోపణలు చేస్తూ ప్రధానికి లేఖ రాశారు. అప్పట్లో.. వ్యాక్సిన్లను ప్రైవేటు ఆస్పత్రులు బ్లాక్‌లో అమ్ముకుంటున్నాయని ఆరోపించారు. ఇప్పుడు అసలు పేషంట్లకు వేయడం లేదని ఫిర్యాదు చేశారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యల కంటే.. ప్రైవేటు ఆస్పత్రులపై ప్రధానికి ఫిర్యాదు చేయడానికి ఎక్కువ ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.