తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్లో పీసీసీ చీఫ్గా రేవంత్ ఎన్నిక హంగామా నడుస్తూండగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన తీరుకు భిన్నంగా అందరితోనూ సమావేశం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు. దళిత్ ఎన్పవర్మెంట్ పేరుతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్త చర్చకు తెరతీశారు. నిజానికి హుజురాబాద్ లో సుమారు 45వేల దళితుల ఓట్లున్నాయి. ఈ ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ దళితులపై ప్రేమ చూపిస్తున్నారని ఇతర పార్టీలు అనుమానిస్తున్నాయి.
సీఎం కేసీఆర్ వరుస రివ్యూలు, సమీక్షల అనంతరం మరోమారు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఆలోగా బీసీ సంఘాల నేతలతో సమావేశం కానున్నారని సమాచారం. దళిత్ ఎం పవర్మెంట్ తరహాలో బీసీ సబ్ ప్లాన్ వచ్చే ఐదేళ్ల ల్లో తీసుకోవాల్సిన అంశాలపై ఆయా వర్గాల ఎమ్మెల్యేలు , ఎంపి లు , ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. తదనంతరం జిల్లాల్లో పర్యటన లో సమగ్రాభివృద్ధి , ప్రభుత్వ పథకాల అమలు తీరు తెన్నులపై ఆరా తీయనున్నారు. ఈ సారి చేయబోయే పర్యటనలో పార్టీ నిర్మాణం, ప్రజల్లో ప్రభుత్వ పనితీరు పట్ల స్థానిక నేతల నుండి సమాచారం సేకరించనున్నారు.
కొంత గ్యాప్ తరువాత సీఎం మళ్ళీ జిల్లాల పర్యటనపై దృష్టి సారించనున్నారు. వివిధ సామాజిక వర్గాల నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదంతా రేవంత్ ఎఫెక్టేనని.. కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఎప్పుడూ గడీ దాటి బయటకు రాని ఆయన ఇప్పుడెందుకు హడావుడి చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.