`నాంది`తో ఎట్టకేలకు ఓ హిట్ కొట్టాడు అల్లరి నరేష్. అంతకు ముందు… హిట్టు కోసం దాదాపు ఏడేళ్లు తపస్సు చేశాడు. డజను ఫ్లాపుల తరవాత, కాస్త బ్రేక్ తీసుకుని, తనలో తాను మధనపడి, రూటు మార్చి చేసిన సినిమా `నాంది`. తనది కాని జోనర్ ట్రై చేయడం నరేష్ కి కలిసొచ్చింది. `నాంది`తో నరేష్ ప్రయాణం కొత్తగా మొదలైంది. ఇక నుంచి.. నరేష్ సీరియస్ టైపు సినిమాలే చేస్తాడేమో అనుకున్నారు జనాలు. నరేష్ కూడా అదే మాట చెప్పేవాడు. కేవలం కామెడీ కోసం జనాలు థియేటర్లకు రానని, ఇంకేదో చేయాలని అంటూండేవాడు. అయితే ఇప్పుడు నరేష్ మళ్లీ తనదైన జోనర్ కి వెళ్లిపోయాడు. ఈరోజు నరేష్ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమా `సభకు నమస్కారం` టైటిల్, పోస్టర్ బయటకు వచ్చాయి. ఆ టైటిల్, అందులోని నరేష్ పోజూ చూస్తే, ఎప్పటిలా నరేష్ `అల్లరి` చేయడానికి సిద్ధమైపోయాడన్న సంగతి అర్థమవుతూనే ఉంది. కానీ… వినోదంతో పాటు, ఓ సోషల్ మెసేజీని కూడా నరేష్ బలంగా చెప్పబోతున్నాడని, ఇదో పొలిటికల్ సెటైర్ అని… సమాచారం అందుతోంది. కేవలం నవ్వుల కోసం జనాలు థియేటర్లకు రారని చెప్పిన నరేష్.. మళ్లీ ఫక్తు కామెడీ కథలు ఎంచుకోడు. ఈసారి అంతకు మించి ఏదో చూపించే ప్రయత్నం కచ్చితంగా చేస్తాడనిపిస్తోంది. అదేంటో, దాని ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.