ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాల కోసం గాని, ఇతర చోట్ల రకరకాల పేర్లతో గాని భారీ ఎత్తున చేపడుతున్న భూసేకరణ తతంగం స్థానికులలో నిరసనకు దారితీస్తున్నది. అసలు అమరావతిలోనే గ్రామ కంఠాలను అంటుకోబోమన్న హామీ గాలికెగిరిపోయి త్యాగాలు తప్పవనే బోధలు మొదలుపెట్టారు. భోగాపురం, గన్నవరం ఎయిర్పోర్టు, బందరు పోర్టు, పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వాపార్కు, అనంతపురంలో సోలార్ ప్లాంటు ఇలా ప్రతిచోటా ఏదో ఒక పేరిట రైతుల నుంచి భూములు లాక్కోవడం పరిపాటిగా మారింది. ఇది పట్టణాలకు కూడా పాకి రామవరప్పాడులో 400 ఇండ్ల కూల్చివేతకు దారితీయడంతో నిరసన వ్యక్తమైంది. ఇందులో పాలుపంచుకున్నందుకు టిడిపి శాసనసభ్యుడు వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు. ఇదేదో దేవినేని సోదరులకు ఆయనకు మధ్య వ్యక్తిగత వివాదంగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. నెహ్రూ పేరు వినిపిస్తున్నా వాస్తవానికి తెలుగుదేశంలో వున్న ఆయన తమ్ముడికి సంబంధించిన హౌటల్ కోసమే ఈ కూల్చివేత అవసరమైందంటున్నారు. పూర్తి నిజానిజాలు ప్రభుత్వమే వెల్లడించాలి. అయితే రామవరప్పాడు ఘటన వంటివి ఇతర పట్టణాలలోనూ జరుగుతున్నాయి. గుంటూరు సుందరయ్య నగర్లోనైతే సిపిఎం కార్యకర్తలపై హత్యాప్రయత్నాలు జరిగి వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదంతా పోలీసుల వత్తాసుతో జరిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ప్రతిచోటా అవసరానికి మించి విచక్షణా రహితంగా భూములు తీసుకోవడం, అక్కడి రైతులను గృహస్తులను వెళ్లగొట్టడం జీవన దృశ్యాన్ని ఛిద్రం చేస్తున్నది. నివాసంతో పాటే వారి ఉపాధి కూడా ముడివడి వుంటుంది గనక బతుకులే కుదేలవుతున్నాయి. వంశీ వంటివారి వివాదాలు ఎలా వున్నా ప్రజల వేదన నిరసన కూడా వారిని ధర్నాలవైపు నడిపిస్తుంది. ప్రజలతో వుండకపోతే రేపు ఠికానా వుండదనే భయం కూడా నాయకులకు వుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్న హౌం మంత్రి చిన రాజప్ప ముందు దౌర్జన్యపుకూల్చివేతలను నిలిపివేయించడం అవసరం. జగన్ కూడా పరామర్శించాడు గనక వంశీని ఆయనను ముడిపెట్టి కథనాలు అల్లడం అవాస్తవమవుతుంది. ఎన్నికల ముందు వారిద్దరూ కలసిన మాట నిజమే గాని అధికారం వదలి జగన్ వెంట వెళ్లేంత అమాయకుడు కాదు వంశీ. ఇదే రివాజుగా మారితే తెలుగుదేశంకు చెందిన ఇతర నేతలు కూడా రేపు ప్రజలతో నిలవాల్సి వస్తుంది.