సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన వెంటనే కేంద్రం.. ప్రైవేటు ఆస్పత్రులకు టీకాల పంపిణీ విషయంలో మార్పులు చేసింది. సీఎం జగన్ డిమాండ్లను యధాతథంగా అమలు చేయకపోయినప్పటికీ.. టీకా విధానంలో మాత్రం స్పష్టమైన మార్పులు చేసింది. టీకాలన్నింటినీ ఆస్పత్రులు వాడటం లేదని.. వాటిని ప్రభుత్వానికి ఇప్పించాలని.. అసలు ప్రైవేటు ఆస్పత్రులకు టీకాలు ప్రభుత్వం ద్వారా వెళ్లాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖలో సూచించారు. దీనికి తగ్గట్లుగా కేంద్రం కొన్ని చర్యలు ప్రకటించింది. టీకాలను ఆస్పత్రులు నేరుగా తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేయడాన్ని నిషేధించింది.
టీకాల కోసం ప్రైవేటు ఆస్పత్రులు కొవిన్ ద్వారా మాత్రమే ఆర్డర్లు పెట్టుకోవాలని ఆదేశించింది. ఎన్ని పడితే అన్ని కొనడానికి చాన్స్ లేదు. గత నెల సగటు వినియోగానికి రెట్టింపు డోసులు మాత్రమే తర్వాతి నెలకు ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ప్రధాని మోడీ ప్రకటించిన వ్యాక్సిన్ విధానం ప్రకారం.. వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి 75శాతం డోసులను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. మిగతా 25 శాతం డోసులను ఉత్పత్తిదారులు నేరుగా ప్రైవేట్‌లో విక్రయించుకోవచ్చు. ప్రభుత్వమే విరివిగా టీకాలు ఇస్తూండటంతో ప్రైవేటు రంగంలో టీకాలు వేయించుకునేవారు తక్కువగా ఉన్నారు.
దీంతో వారి దగ్గర టీకాలు మిగిలిపోతున్నాయి. ప్రవేటు ఆసుపత్రులకు 25శాతం టీకాలను కేటాయించడం చాలా ఎక్కువ అని, దాన్ని తగ్గించాలంటూ తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఇటీవల కేంద్రానికి లేఖ రాశాయి. కేంద్ర కేబినెట్ కార్యదర్శితో జరిగిన సమావేశంలోనూ ఇవే అభిప్రాయాన్ని చెప్పి.. చివరికి కేంద్రం నిర్ణయం ప్రకటించే ఒక్క రోజు ముందు సీఎం జగన్ కూడా కేంద్రానికి లేఖ రాశారు. క్రెడిట్‌ను ఆయన ఖాతాలో కూడా వేసుకున్నారు.