ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా చెలామణి అవుతూ.. పుట్టినరోజు సందర్భంగా వీధివీధినా పాలారభిషేకాలు చేయించుకుంటున్న విజయసాయిరెడ్డికి… విజయనగరం టీడీపీ నేత అశోక్ గజపతిరాజును ఏదో చేయాలన్న ఆవేశంతో రగిలిపోతున్నారు. మాన్సాస్ ట్రస్ట్ పీఠాన్ని న్యాయపోరాటం చేసి మళ్లీ దక్కించుకున్న ఆయనపై… ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నారు.ఆరు విచారణ కమిటీలు వేశారు. దానికి తానే నేతృత్వం వహిస్తున్నట్లుగా.. విచారణలో ఫలానా తేలిందని.. ట్వీట్లు చేస్తున్నారు. ఓ అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేసి.. అతని ద్వారా చాలా అక్రమాలు చేశారని సోషల్ మీడియాలో నిందిస్తున్నారు. వీటికి తోడు ఇప్పుడు అశోక్‌గజపతిరాజుపై ఎటాక్‌కు మహిళల్ని కూడా ప్రయోగిస్తున్నారు.
అశోక్ గజపతిరాజు మహిళల్ని కించ పరిచారంటూ.. హఠాత్తుగా సంచైత .. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకు ఫిర్యాదుచేశారట. వాసిరెడ్డి పద్మ…హుటాహుటిన విశాఖకు వచ్చి మీడియా మైకుల ముందు గర్జించారు. అశోక్‌గజపతిరాజుకు అహంకారం అని.. మహిళకు అన్ని రంగాల్లో హక్కులున్నాయని… తేల్చేశారు. ఇంతకీ సంచైత ఏమని ఫిర్యాదు చేశారు.. మహిళాకమిషన్ చైర్పర్సన్ ఎందుకంత ఆవేశపడ్డారు.. అని చాలా మందికి డౌట్ వచ్చింది. మాన్సాస్ ట్రస్ట్ బైలాలో పురుషులకు మాత్రమే చైర్మన్ పదవి దక్కాలనిఉంది. అదేసమయంలో… సోషల్ మీడియాలో తండ్రి పేరు పేరు మార్చుకునే సంచైత గురించి తానేం మాట్లాడగలనని అశోక్ విమర్శించారు. ఈ రెండు తప్పలని విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని… వాసిరెడ్డి పద్మ అంటున్నారు.
అశోక్ గజపతిరాజు… సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటున్నారు. ఈ ఏడాది కాలంలో జరిగిన తప్పులేమిటో బయటకు తీయడానికి ఆయన చేయాల్సిందంతా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను నిలువరించడానికో.., లేకపోతే మళ్లీ ఆయన పీఠాన్ని లాగేసుకుని మళ్లీ సంచయితకు అప్పగించడానికో కానీ విజయసాయిరెడ్డి తెగ ఆవేశ పడుతున్నారు. రాజులు సున్నిత మనస్కులు కాబట్టి వారిని ఇష్టారీతిన తిడితే.. మానసికక్షోభకు గురవుతారని ఆయన అంచనా వేసుకున్నామో కానీ.. పూర్వీకుల్ని కూడా వదలడం లేదు. తాజాగా మహిళా ప్రయోగం చేస్తున్నారు. పగబట్టిన వ్యక్తిపై..అధికారం అండతో ఇంత దారుణంగా ఎటాక్ చేసే రాజకీయం.. ఇప్పుడిప్పుడే చూస్తున్నామని ఉత్తరాంధ్ర ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.