`మా` బిల్డింగ్ వ్యవహారం ఎన్నో ఏళ్లుగా నలుగుతూనే ఉంది. ఎంతో మంది అధ్యక్షులు మారినా.. `మా`కు బిల్డింగ్ రాలేదు. `మా`లో ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రతీసారీ `మా` బిల్డింగే ప్రధానమైన అజెండా. కానీ ఇప్పటి వరకూ ఆ ఆశ తీరలేదు. దేశం మొత్తం గర్వించదగిన నటీనటులు ఉన్నా, వందల కోట్ల పారితోషికాలు తీసుకుంటున్నా – మాకు బిల్డింగ్ లేకపోవడం ఏమిటి? మా బిల్డింగ్ స్థలం కోసం ప్రభుత్వం ముందు చేతులు చాచడం ఏమిటి? అనే విమర్శలు వచ్చినా, `మా` సభ్యుల వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదు. చివరికి ఈసారి జరగబోయే ఎన్నికల ప్రధాన అజెండా కూడా ఇదే.
దాంతో.. `మా` వైఖరి, వాళ్ల చేతకానితనంపై చాలా విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ చిత్రసీమ ఇప్పుడు తిప్పి కొట్టాలనుకుంటోందని సమాచారం. `మా` బిల్డింగ్ బాధ్యత మొత్తం…చిరంజీవి తీసుకున్నట్టు ఇన్సైడ్ వర్గాల టాక్. ఈసారి `మా` ఎన్నికలలో ఎవరు గెలిచినా సరే, చిరు ఆధ్వర్యంలో `మా` బిల్డింగ్ కి సంబంధించిన పనులు వేగవంతం అవుతాయని తెలుస్తోంది. త్వరలోనే చిరు, ఇతర సినీ ప్రముఖులు కేసీఆర్ ని కలుస్తారని, స్థలం విషయంలో ఓ క్లారిటీకి వస్తారని, ప్రభుత్వం స్థలం ఇవ్వని పక్షంలో.. నటీనటులంతా కలిసి, ఓ కమిటీగా ఏర్పడి, ఫండ్ వసూలు చేస్తారని, రెండేళ్లలోగా బిల్డింగ్ పనులు పూర్తి చేస్తారని తెలుస్తోంది. `మా` భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం భరించడానికి మంచు మోహన్ బాబు సిద్ధంగా ఉన్నారు. మరో 75 శాతం రాబట్టడం కష్టం కాదు. `మా` బిల్డింగ్ లో ఓ బ్లాక్ ని చిరు తన సొంత డబ్బులతో నిర్మిస్తారని, మిగిలిన ప్రధాన హీరోలూ ముందుకొస్తే… అసలు `మా` బిల్డింగ్ పెద్ద సమస్యే కాదని.. `మా` లోని కీలకమైన సభ్యుడు ఒకరు చెప్పారు. నిజంగానే `మా` బిల్డింగ్ బాధ్యత చిరు తీసుకుంటే, ఈ సమస్యకు పరిష్కార మార్గం దక్కినట్టే.