తెలుగు సినిమా వాళ్లంతా స్వచ్చమైన వారు. వారికి డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లు అసలు లేవు. ఉన్నాయేమో అని గతంలో సీరియల్‌గా రోజుకొకరిని చొప్పున పిలిచి.. గోళ్లు, వెంట్రుకలు తీసుకుని టెస్టులు చేయించిన తెలంగాణ అధికారులకు ఈ నిజం తెలిసిపోయింది. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ పోలీసులు ఈ నిజాన్ని కోర్టుకు తెలిపారు. డ్రగ్స్ కేసులో వీరు వేసిన చార్జిషీట్‌ను న్యాయస్థానం ఆమోదించింది. డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానంతో గతంలో విచారించి 11 మంది సినీ ప్రముఖులకు క్లీన్చిట్ ఇచ్చారు.
ప్రముఖ హీరో రవితేజ సోదరుడు శంషాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ సమయంలో ఆయనకు సంబంధించిన ఫోన్ పోలీసులకు లభించింది. ఆ ఫోన్‌ను విశ్లేషిస్తే.. టాలీవుడ్లో డ్రగ్స్ దందా మొత్తం బయటపడిందని ప్రచారం జరిగింది. 2017 జులై 2న 12 డ్రగ్స్ కేసులు నమోదు చేశారు. 30 మందిని అరెస్ట్ చేసి 27 మందిని ప్రశ్నించారు. తొలుత 8 కేసుల్లో మాత్రమే చార్జిషీట్ ఫైల్ చేశారు. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో మరో 4 చార్జిషీట్లు దాఖలు చేశారు. ఆ ఫోన్లో దొరికిన సమాచారమో… మరెక్కడి నుంచి అయినా లభించిందో కానీ పెద్ద ఎత్తున తర్వాత రెయిడింగ్‌లు చేసి.. డ్రగ్ పెడలర్లను పట్టుకున్నారు. టాలీవుడ్ ప్రముఖుల్ని పిలిపించి ప్రశ్నించారు. వారి శాంపిళ్లను తీసుకున్నారు.
అప్పట్లో టాలీవుడ్ .. ఏపీ ప్రభుత్వ పెద్దలతోనే సన్నిహితంగా ఉన్నారన్న విమర్శలు .. టీఆర్ఎస్ వైపు నుంచి వచ్చేవి. ఈ వివాదం తర్వాత టాలీవుడ్ మొత్తం.. టీఆర్ఎస్ అధికార పార్టీతో సన్నిహితమయింది. దాంతో కేసులో తీవ్రత తగ్గిపోతూ వచ్చింది. చివరికి సినీ తారలపై మరకపడకుండా.. టాలీవుడ్ పెద్దలు కవర్ చేసుకోగలిగారు. ఈ కేసులో తెలంగాణ పోలీసులు సరిగ్గా విచారణ చేయడం లేదని.. కేసును.. ఈడీకి అప్పగించాలని… ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ న్యాయపోరాటం చేస్తున్నారు.