పార్టీలను ధిక్కరించిన వారిపై అనర్హతా వేటు వేయాలంటే అది పూర్తిగా స్పీకర్ చేతుల్లోనే ఉందని.. స్పీకర్‌కు కాలపరిమితి నిర్దేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టమైన రూలింగ్ ఇచ్చింది. నిజానికి స్పీకర్ అధికారాలపై ఇప్పటికే స్పష్టత ఉంది. రాజ్యాంగం ప్రకారం… అసెంబ్లీ స్పీకర్ పదవి.. రాజ్యాంగబద్ధమైన అధికారాలతో ఉంటుంది. సభకు సంబంధించినంత వరకూ.. ఆయనే సుప్రీం. అయితే.. ఇటీవలి కాలంలో స్పీకర్లు.. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రత్యేక కారణం ఉంటే నిర్ణయం ప్రకటిస్తున్నారు తప్ప.. మిగతా సందర్భాల్లో పక్కన పెట్టేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. స్పీకర్ గా అధికార పార్టీకి చెందిన వారు ఉంటారు కాబట్టి .. అధికార పార్టీలో అనధికారికంగా చేరే వారిపై చర్యలు తీసుకోవడం లేదు.
గతంలోటీడీపీ హయాంలో 23 మంది వైసీపీ ఎణ్మెల్యేలు టీడీపీలో చేరారు. అప్పుడు వైసీపీ ఫిర్యాదు చేసినా.. స్పీకర్ కోడెల నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు వైసీపీలో టీడీపీ ఎమ్మెల్యే అనధికారికంగా చేరారు. వారికి స్పీకర్ ప్రత్యేక కుర్చీలు కేటాయించారు కానీ.. చర్యలు తీసుకోలేదు. చివరికి రఘురామకృష్ణరాజుపై అనర్హతా వేటు వేయాలని.. విజయసాయిరెడ్డి స్పీకర్‌కు లేఖ రాశారు. అందులో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ఆయన చె్ప్పుకొచ్చారు. వీటన్నింటికీ .. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ .. సమాధానం ఇచ్చినట్లయింది.
పార్టీ ఫిరాయింపుల పిటిషన్ల పరిష్కారానికి కాలపరిమితి విధించలేమని.. పార్లమెంట్, అసెంబ్లీ అధికారాల్లోకి చొరబడలేమని సుప్రీంకోర్టు తేల్చేసింది. రాజకీయ పార్టీలు.. చేసే చట్టాలు ఇలాగే ఉంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి అనుకూలంగా ఉండేలా చట్టాలు రూపొందించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది.. ఇందులో.. స్పీకర్‌దే అంతిమ నిర్ణయం అని క్లాజ్ పెట్టింది. దీంతో అధికార పార్టీలకు వరంగా మారింది.అప్పట్లో కాంగ్రెస్ లబ్ది పొందింది. ఇప్పుడు బీజేపీ ..ఇతర అధికార పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి.