సరివారిలోన నేర్పున
దిరిగెడు వారలకుగాక తెరవాటులలో
నరయుచు మెలగెడి వారికి
బరువేటికి గీడె యనుభవంబు కుమారా!
కుమార శతకంలోని ఈ పద్యం తాత్పర్యం ” ఓ కుమారా! మంచివాళ్లతో సమానులతో కలిసి నడిస్తే గౌరవం, కీర్తి లభిస్తాయి. అలా కాకుండా దుష్టుల తోనూ, దొంగలతోనూ స్నేహం చేస్తే గౌరవం పోతుంది..కీడు జరుగుతుంది..!” . తెలు గు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ” స్నేహ రాజకీయాలు.. వివాదాలు..విమర్శలు.. తిట్ల పురణాలు” చూస్తున్న వారికి.. రెండు వైపులా… ఈ కుమారశతకం పద్యం గుర్తు చేసుకుంటున్నారు. రెండు వైపులా… స్నేహం చేసి తప్పు చేశామనే వాదనలు వినిపిస్తున్నారు. కేసీఆర్‌ది ధృతరాష్ట్ర కౌగిలి అని ముందే జగన్‌కు చెప్పానని పేర్ని నాని అనే పెద్ద మనిషి మీడియా ముందుకు వచ్చి ఘనమైన స్టేట్మెంట్లిస్తున్నారు. వైఎస్‌లా జగన్ ఉండరని నమ్మి స్నేహహస్తం అందించామని శ్రీనివాస్ గౌడ్ అనే మరో తెలంగాణ ప్రభుత్వ పెద్ద మనిషి…అదే తరహా స్టేట్మెంట్లిస్తున్నారు.
కేసీఆర్ – జగన్ సమఉజ్జీలైన స్నేహితులు..! ఎవర్ని ఎవరు మోసం చేస్తున్నారు..?
కేసీఆర్ ఔదార్యం చూపిస్తున్నారు. ఏపీకి నీళ్లిస్తామంటున్నారు. ఆయన మహానుభావుడు.! : 11 జులై 2019న అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్
కృష్ణా నీటిని కేసీఆర్ అక్రమంగా వాడేస్తున్నారు. మీరే అడ్డుకోవాలి : 1 జూలై 2021న అదే ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి రాసిన లేఖలో సారాంశం.
రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా : ఆగస్టు 2019 లో నగరిలో రోజా ఇంట్లో కేసీఆర్
ఈ ప్రకటనలు.. ఇప్పుడు జరుగుతున్న ఘటనల మధ్య హస్తిమశకాంతరం ఉంది. ఈ తేడా రెండు అంటే రెండు ఏళ్లలో కనిపిస్తోంది. ఈ రెండు ఏళ్లలో ఏం మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాజకీయంగా .. ఏపీ సీఎం జగన్‌కు ఎక్కడా తేడా రాలేదు. ఇద్దరు మంచి కోఆర్డినేషన్‌తో రెండు రాజకీయాలు సమన్వయం చేసుకుంటున్నారు. దీనికి చక్కని ఉదాహరణ.. రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు .. చడీ చప్పుడు లేకుండా వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి సహకరించడం. ఎంపీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకుపోతూంటే.. ప్రభుత్వానికి సమాచారం ఉండదని అనుకోవడం భ్రమే. అదీ లాక్ డౌన్ సమయంలో. ఇలాంటి సహకారం ఇప్పటిది కాదు. గత ఎన్నికలకు ముందు డేటా చోరీ పేరుతో ఏపీలో రాజకీయ అలజడి సృష్టించడానికి తెలంగాణ పోలీసులు సహకరించడం దగ్గర్నుంచీ ఉంది. ఇప్పటికీ ఉంది. అప్పట్లో కేసీఆర్ నీళ్లిస్తున్నారని.. జగన్ ఆయనను ఆకాశానికెత్తేశారు. ఇప్పుడు మాత్రం.. జల చౌర్యం చేస్తున్నారని అంటున్నారు. రాజకీయంగా ఇరువురి మధ్య ఒకే రకమైన పరస్పర సహకారం చేసుకుంటున్నప్పుడు… పాలనా పరంగా మాత్రం ఇద్దరి మధ్య విబేధాలు ఎందుకొచ్చాయి..? రాజకీయ అవసరాల కోసమా..? ప్రజల్ని మభ్య పెట్టడానికా..?
తమది ఇష్టారాజ్యమని ఇద్దరి భావన..!
అసలు ప్రస్తుత వివాదంలో తప్పెవరిది అంటే.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులది అని చెప్పక తప్పదు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏపీ సీఎం జగన్ రూపకల్పన చేశారు. ఆయన ముఖ్యమంత్రి లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి. తాను చేపట్టిన ప్రజోపయోగకరమైన పనిని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి..? ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందుగా చేయాల్సినంత కసరత్తు చేయాలి. అది పాత ప్రాజెక్టే అని వాదిస్తున్నారు కనుక ముందుగానే అన్నీ అనుమతులు పొందాలి. కేసీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు… కేంద్రంతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆ పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ జగన్ ఏం చేశారు..? ఎవరికీ చెప్పకుండా… ఎవరి అనుమతి తీసుకోకుండా టెండర్లు ఖరారు చేశారు. కృష్ణాబోర్డు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు ఉన్నా.. లెక్క చేయకుండా పనులు ప్రారంభించేశారు. ఇప్పటికీ జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై చేస్తున్నపని పావలా అయితే చేసుకుంటున్న ప్రచారం.. ముప్పావలా. టీఎంసీల కొద్దీ నీటిని రాయలసీమకు తరలిస్తామని గొప్పలు పోయారు. అది తెలంగాణలో సెంటిమెంట్‌గా మారిపోయింది. అసలు మొత్తంగా చూస్తే… జగన్మోహన్ రెడ్డే వ్యూహాత్మకంగా తెలంగాణలో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఇలా చేశారా.. అన్న అనుమానం.. ఈ మొత్తం.. వాటర్ సీన్లు చూసిన తర్వాత మనకు అనిపిస్తే అది మన తప్పు కాదు.
యధేచ్చగా చట్టాలను ఉల్లంఘిస్తున్న ముఖ్యమంత్రులు..!
అదే సమయంలో సీఎం కేసీఆర్ అంది వచ్చిన అవకాశాన్ని చాలా పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. ఆయనేం నిబంధనలకు అనుగుణంగా చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే.. ఘోరమైన ధిక్కారానికి పాల్పడుతున్నారు. కృష్ణా ప్రాజెక్టుల్లో పోలీసుల్ని కాపలా పెట్టి మరీ పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీరు మొత్తాన్ని ఖాళీ చేస్తున్నారు. ఇదంతా ధిక్కారమే. చట్టాల ఉల్లంఘనే. కానీ.. దీనికి కేసీఆర్ వద్ద చాలా స్పష్టమైన సమాధానం రెడీగా ఉంది. అదే… చట్టాలను.. ఏపీ సీఎం జగన్ ఉల్లంఘిస్తున్నా… పట్టించుకోని కేంద్రం… తాము ఉల్లంఘిస్తే ఎలా పట్టించుకుంటుందన్నది ఆ సూత్రం. సీమ ఎత్తిపోతల పనులు అనుమతులు తీసుకునేవరకూ ఆపాలని. .. అటు ఎన్జీటీ.. ఇటు కేఆర్ఎంబీ ఏపీ సీఎం జగన్‌కు స్పష్టమైన ఆదేశాలిచ్చినా… పనులు చేపడుతున్నారు. ఇంకా ఆపేది లేదని కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. జగన్ ఆదేశాలు పాటించనప్పుడు.. తాము మాత్రం ఎందుకు పాటించాలని .. తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. తమ ఇష్టారీతిన వ్యవహరిస్తారమని… ఎగువ రాష్ట్రమైన తాము కన్నెర్ర చేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తామని… రంగంలోకి దిగారు. మాటల కన్నా కేసీఆర్ చేతుల్లోనే తమ ఆగ్రహం ఏపీకి ఎంత నష్టం కలిగిస్తుందో చూపిస్తున్నారు. ఇప్పుడు సర్వ స్వతంత్రంగా ఎవరికీ సంబంధం లేకుండా… కృష్ణాకు తెలంగాణలోనే అడ్డుకట్ట వేసే ప్రాజెక్టులకు సర్వేలు చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చారు. జల వ్యవహారాలపై సీఎం కేసీఆర్‌కు ఉన్న పట్టు అంతా ఇంతా కాదు. తెలంగాణ ప్రాజెక్టుల్ని మొత్తం రీడిజైన్ చేసిన ఘనత ఆయన సొంతం. ఆ నైపుణ్యం మొత్తం ఇప్పుడు ఏపీని ఫిక్స్ చేయడానికి కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారు.
పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీరుస్తుంది..! ఇక్కడా పిల్లి కేంద్రమే..!
ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. యథేచ్చగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఆయన అలా చేశారు కాబట్టి.. మేము ఇలా చేస్తున్నామని ఇద్దరూ ఒకరినొకరు సాకుగా చూపించుకునే పరిస్థితులు వచ్చాయి. పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం ఎవరు..? . నిస్సంకోచంగా కేంద్ర ప్రభుత్వమే. రాష్ట్రాల అధికారాలకు కోతలు వేసేందుకు… ప్రభుత్వం అంటే… లెఫ్టినెంట్ గవర్నరే అన్న విధంగా చట్టాలు మార్చి ప్రజాస్వామ్య మౌలిక భావనను కూడా దెబ్బతీయడానికి సిద్ధంగా ఉండే.. కేంద్రం …రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించకుండా మరింత పెద్దదయ్యేలా చేస్తూ… తమ మీద ఆధారపడేలా చేసుకుంటోంది. దానికి ఏపీ – తెలంగాణ మధ్య వివాదమే పెద్ద ఉదాహరణ. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు వస్తాయని తెలుసు. అందుకే కృష్ణాబోర్డు, గోదావరి బోర్డును ఏర్పాటు చేశారు. మరిఆ బోర్డులను స్వతంత్రంగా పని చేసుకునే అవకాశం కల్పించాలిగా..?. వారి ఆదేశాలు ఎవరూ ధిక్కరించకుండా చట్టబద్ధమైన అధికారాలు కల్పించాలిగా..? అలాంటిదేమీ చేయలేదు. ఫలితంగా.. ప్రభుత్వాలు.. ఎవరి బలం మేరకు వారు జలాల్ని వాడుకుంటామంటూ వాదిస్తూ.. ముందుకెళ్లాయి. వారించాల్సిన ప్రభుత్వం ఇంత వరకూ జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు.. ఏపీ సీఎం జగన్.. ప్రధానమంత్రి రాసిన లేఖలో… ప్రాజెక్టుల్ని కేంద్రం పరిధిలోకి తీసుకోవాలన్న సూచన కూడా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి కోసమే కేంద్రం.. ఈ వివాదాన్ని చూస్తూ .. పోతోంది. ఇప్పుడు ప్రాజెక్టుల్ని కూడా కేంద్రం స్వాధీనం చేసుకుంటే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం.
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం వాంఛనీయమా..? కేంద్రం నిర్లిప్తత.. సహజమేనా..? .. ఎందుకు రాష్ట్రాలు.. కేంద్రం… ఇంత అనాలోచితంగా వ్యవహరిస్తున్నాయి..? కనీస బాధ్యత లేకుండా ఉంటున్నాయి..? అని ఆలోచిస్తే… అందరికీ తట్టేది ఒక్కటే కారణం. రాజకీయం. రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు.. ప్రజాకోణంలో ఆలోచించకుండా తమ రాజకీయ వ్యూహాల కోణంలో ఆలోచించి.. సెంటిమెంట్లు రెచ్చగొట్టి తాత్కలిక రాజకీయ లబ్ది పొందేందుకు ఆడుతున్న గేమ్ ఇదని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఇందు కోసం అద్భుతమైన కోఆర్డినేషన్ అధికార పార్టీల మధ్య ఉంది. ఇక్కడ ప్రజాప్రయోజనాలు అనే అంశాన్ని ఒక్క తెలంగాణ మాత్రమే చాలా గట్టిగా ఉపయోగించుకుంటోంది. బహుశా.. అక్కడ ఆ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పే.. హుజూరాబాద్ ఉపఎన్నిక జరుగుతూండటం కారణం కావొచ్చు. తెలంగాణ ఉద్యమం గుండెల నిండా నింపుకున్న హుజారాబాద్ ప్రజల్లో మరింత సెంటిమెంట్ నింపే ప్లాన్ కావొచ్చు. కేసీఆర్… ఆంధ్రతో చెట్టాపట్టాలేసుకుని లేరని.. అవసరం అయితే.. ఆ రాష్ట్రాన్ని ఏం చేసేందుకైనా వెనుకాడరని నిరూపించడానికన్నట్లుగా ఉంది. ఇటు ఏపీ సీఎం జగన్‌కు ఇప్పుడు ఎలాంటి రాజకీయ అవసరాలు ప్రస్తుతానికి లేవు. అందుకే.. రాజకీయ మిత్రుడు చేయాల్సినంత రాజకీయాన్ని చేసుకోనిస్తున్నారు. ఈ క్రమంలో జలాల్ని కరెంటు ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నా లైట్ తీసుకుంటున్నారు. లేఖలతో సరి పెడుతున్నారు. కేంద్రం కూడా పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చేస్తుందన్న తరహాలో.. పిల్లి పాత్ర పోషించడానికి కాచుకుని కూర్చుంది. ఇక్కడా అంతా రాజకీయమే. ఎక్కడా.. ఎవరి ఆలోచనల్లోనూ ప్రజా ప్రయోజనాల్లేవు.
అంతిమంగా నష్టం దిగువ రాష్ట్రమైన ఏపీ ప్రజలకు .. లాభం జగన్మోహన్ రెడ్డికి..!
ఈ రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుభవ లేమితో చాలా అడ్డంగా ఇరుక్కుపోతున్నారి ..రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న వారెవరికైనా అర్థమైపోతుంది. రెండేళ్లలోనే ఎంత మార్పు..? ఆనాడు బేషన్లు లేవన్నారు.. బేషజాలు లేవన్నారు.. ఇవాళ… ప్రధానికే తెలంగాణపై ఫిర్యాదు చేశారు. నాడు సీఎం జగన్‌కు ఎందరో జల నిపుణులు.. తమ అభిప్రాయాలు వివరించారు. సలహాలు చెప్పారు. ఇది భవిష్యత్ ఆంధ్రను నిర్దేశిస్తుంది.. జాగ్రత్తగా ముందడుగు వేయమన్నారు. కానీ.. అప్పుడు జగన్ విననే వినలేదు. తెలంగాణతో నీటి ఒప్పందాలుంటాయని… ఉమ్మడి ప్రాజెక్టులు కట్టేస్తామని.. చెలరేగిపోయారు. అక్రమం అని తానే వాదించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి తానే వెళ్లి.. ఎప్పటికీ దిద్దుకోలేని తప్పు చేసారు. ఇప్పుడు అదే తెలంగాణపై ఆయన జల చౌర్యం ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలుఆయనను ఎలా నమ్ముతారు..? ఆయనను గుడ్డిగా సమర్థించే ఓటు బ్యాంక్ నమ్ముతుందేమో కానీ.. సామాన్యులు ఎవరైనా నమ్ముతారా..? నమ్మకపోగా… నాణ్యమైన మోసంచేశారని సులువుగా అర్థం చేసుకుంటారు..! ఈ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి.. తెలియాల్సిన సమయంలోనే తెలుస్తుంది. అప్పుడే… ఢక్కామొక్కీలు తిన్న రాజకీయంలో.. తనకు రాజకీయంగా తాత్కాలిక గెలుపుల కోసం సాయం చేసి.. మొత్తంగా బయటకు రాలేని విధంగా ఇరికించేశారని అర్థం అవుతుంది. అప్పుడు చేయగలిగిందేమీ ఉండదు. అప్పటికీ ఆయన పద్మవ్యూహంలో ఇరుక్కుని ఉంటారు.
తెలుగు రాష్ట్రాల మధ్య గతంలో వివాదాలు ఫిర్యాదులు.. కోర్టుల్లో పిటిషన్ల వరకే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రత్యక్షయుద్ధం స్థాయికి దిగజారాయి. రెండు తెలుగు రాష్ట్రాలు నిబంధనలు మేమెందుకు పట్టించుకోవాలని మంకుపట్టు పడుతున్నాయి. యధేచ్చగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. చట్టాలను ఉల్లంఘిస్తున్నది మీరంటే మీరని ఫిర్యాదులు చేసుకుంటున్నారు. సందట్లో సడేమియాలా ఈ పరిణామాల్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ఎవరి ఆరాటం వారు పడుతున్నారు. ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చడానికి ఎలాంటి ప్రకటనలు ఇవ్వాలి.. ఎవర్ని ఎలా తిట్టాలో అలా తిట్టడం ప్రారంభించారు. కాస్త కళ్లు విప్పార్చి చూస్తే.., ప్రజాప్రయోజనాలను పక్కన పెట్టేసి… రాష్ట్ర ప్రయోజనాలను గండి కొట్టేసి.. యథేచ్చగా రాజకీయం చేసుకుందామన్న రాజకీయ పార్టీల దుర్భుద్దే ఈ వివాదంలో కనిపిస్తోంది.
ఇలాంటి రాజకీయాలు కళ్లముందు కనిపిస్తున్నా… తాము అభిమానిస్తున్న పార్టీని సపోర్ట్ చేయడానికి కళ్లు తెరవడానికి సిద్ధపడని ఓటు బ్యాంక్ ను ఆయా పార్టీలు సిద్ధం చేసుకున్నాయి. కులం, మతం, ప్రాంతం మత్తులో అందర్నీ దించేశాయి. అందుకే… అన్ని రాజకీయ పార్టీలు తమ తమ నాటకాల్ని రక్తికట్టిస్తున్నాయి. అయితే దీనిపై ప్రజలకు అవగాహన కలిగిన నాడు.. చైతన్యం వచ్చిన రోజున… తామేం కోల్పోయామో తెలుసుకున్న రోజున… విప్లవమే పుడుతుంది.