రానా – సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో పోషించిన చిత్రం `విరాటపర్వం`. ప్రియమణి కీలక పాత్రధారి. వేణు ఉడుగుల దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు. అయితే ఈ సినిమా వెనుక మరో దర్శకుడి హస్తం కూడా ఉందని ఇన్ సైడ్ వర్గాల టాక్. వేణు ఉడుగుల కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించలేకపోయారని, ఆయన స్థానంలో మరో దర్శకుడు ఆ బాధ్యత తీసుకున్నాడని సమాచారం. నిజానికి ఏప్రిల్ లోనే ఈ సినిమా రావాల్సింది. రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. కానీ.. కరోనా కారణాలతో విడుదల కాలేదు. రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు ఆ హడావుడిలో.. సినిమాని వేగవంతంగా పూర్తి చేయాల్సివచ్చింది. అప్పుడే వేణు అందుబాటులో లేకుండా పోయారని, ఆ స్థానంలో మరో దర్శకుడితో.. పతాక సన్నివేశాల్ని చిత్రీకరించారని తెలుస్తోంది. అయితే.. ఇది లోపాయికారి వ్యవహారం కాబట్టి, బయటకు రానివ్వలేదు.