రోమ్ వెళ్లినప్పుడు రోమన్‌లాగే ఉండాలంటారు..ఇప్పుడు రాజకీయాల్లో కూడా అంతే ఏ పార్టీలో చేరితే ఆ పార్టీలో ఇమిడిపోవాలంతే. లేకపోతే..ముందడుగు వేయలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ సూత్రాన్ని బాగానే వంటబట్టించుకుంటున్నారు. కాంగ్రెస్ మార్క్ రాజకీయాల్ని అలాగే డీల్ చేస్తున్నారు. రేవంత్‌కు పీసీసీ అధ్యక్షపదవి ఇస్తే పార్టీలో కల్లోలం రేగుతుందని దశాబ్దాల తరబడి పార్టీని అంటి పెట్టుకున్నవారు ఒక్కరూ ఉండరని .. సీనియర్లు హైకమాండ్‌కు హెచ్చరికల్లాంటి సందేశాలు పంపారు. కానీ హైకమాండ్… ఉంటే ఉంటారు లేదంటే లేదన్నట్లుగా పీసీసీ చీఫ్ పదవి రేవంత్‌కు ఇచ్చి పార్టీని అంటి పెట్టుకున్న ఇతరులకు ఇతర పదవులు కేటాయించింది. ఈ పదవుల పంపకంతో సీనియర్ల కొంత మందితీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
కోమటిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేఎల్లార్ రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. మర్రి శశిధర్ రెడ్డి కూడా అసంతృప్తికి గురయ్యారన్న ప్రచారం జరిగింది. ఇక భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు లాంటి సీనియర్లు నోరు తెరవడం లేదు. రేవంత్‌కు అనుకూల ప్రకటనలు చేయడం లేదు. కానీ.. మూడు రోజుల్లోనే రేవంత్ పరిస్థితిని మార్చేశారు. ధన్యవాదాలు చెప్పడానికి ఢిల్లీ వెళ్లి వచ్చేసరికి అంతా కూల్ అయ్యేలా చసుకున్నారు. కోమటిరెడ్డి ఇక తాను ఏమీ మాట్లాడబోనని ప్రకటించారు. భట్టిని కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కు విధేయ ప్రకటన చేశారు. ఇప్పుడు.. రేవంత్‌కు వ్యతిరేక వాయిస్ కాంగ్రెస్ పార్టీలో లేకుండా పోయింది.
కాంగ్రెస్ పార్టీలో ఏదైనా హైకమాండ్ ద్వారానే పనులు చేసుకుంటూ రావాలి. అంతా తాను చేసినా… తాను చేయాలనుకున్న పనులైనా.. హైకమాండ్ ద్వారా చేయించుకోవాలి. అప్పుడు మాత్రమే పనులు అవుతాయి. ఈ సూత్రాన్ని రేవంత్ రెడ్డి బాగా కనిపెట్టారు. అందుకే కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండే రాహుల్ గాంధీకి సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు. ఆ ఫలితం ఇప్పుడు.. పార్టీలో ఉపయోగపడుతోంది. ఇప్పుడు కొంత మంది సైలెంట్‌గా ఉండవచ్చు కానీ… క్యాడర్లో కనిపిస్తున్న ఏకాభిప్రాయంతో మిగిలిన సీనియర్లు రేవంత్ బాటలో నడవక తప్పదన్న చర్చ ఇప్పటికే ప్రారంభమైంది.