క్రమంగా చిత్రసీమలో ఓటీటీ ఓ అంతర్భాగమైపోయింది. ఓటీటీని వేరుగా, సినిమాని వేరుగా చూడలేని పరిస్థితులు వచ్చాయి. ఓరకంగా చెప్పాలంటే.. థియేటర్ వ్యవస్థ మొత్తాన్ని తీవ్రంగా ప్రభావితం చూపించింది ఓటీటీ. మరోవైపు.. చిన్న నిర్మాతలకు ఓటీటీ అంతో ఇంతో మేలు చేస్తోంది కూడా. చిన్న సినిమాలు, విడుదల కాని చిత్రాలకు.. ఓటీటీ ఓ భరోసా ఇస్తోంది. అందుకే… ఓటీటీలు మరింతగా విస్తరిస్తున్నాయి. కోలీవుడ్ నిర్మాతలంతా కలిసి ఓ ఓటీటీ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పుడు కేరళ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వమే.. ఓ ఓటీటీ సంస్థని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. చిన్న సినిమాలకు ఈ వేదిక ఎంతో ఉపకరిస్తుందని కేరళ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ప్రకటించారు. మల్లూవుడ్ నుంచి యేడాదికి దాదాపు 100 సినిమాలువస్తున్నాయి. వాటిలో చిన్న సినిమాలదే అగ్ర పీఠం. అయితే వాటిలో చాలా వరకూ విడుదలకు నోచుకోవడం లేదు. ఈ సమస్యని పరిష్కరించడానికే ఓటీటీ సంస్థని నిర్మిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. దేశం మొత్తమ్మీద ఎక్కువ సినిమాలు నిర్మించేది టాలీవుడ్ లోనే. ఇక్కడి ప్రభుత్వాలూ అలాంటి ప్రయత్నాలు చేస్తే – చిన్న నిర్మాతలకు కావల్సినంత భరోసా ఇచ్చినట్టు అవుతుంది.