గతంలో కంటే ఈసారి `మా` ఎన్నికలు మరింత వాడీ వేడీగా జరగబోతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ మా అధ్యక్షుడ్ని ఏక గ్రీవంగానే ఎన్నుకోవాలని అని సినీ పెద్దలు భావిస్తున్నా, అలాంటి వాతావరణం ఏమి కనిపించడం లేదు. పోటీ తప్పనిసరి అయినప్పుడు – ఎవరూ ఏమీ చేయలేరు. ఈసారి గనుక ఎన్నికలు జరిగితే.. విజయం ప్రకాష్ రాజ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు లెక్కగడుతున్నాయి. ప్రకాష్ రాజ్ వెనుక మెగా సపోర్ట్ ఉందని, చిరు ఆశీస్సులు ఉంటే.. విజయం నల్లేరుపై నడకే అని అంచనా వేస్తున్నారు. కానీ ప్రకాష్ రాజ్ ని చాలామైనస్ పాయింట్లు వెంటాడుతున్నాయి.
ముఖ్యంగా.. `మా` విషయంలో ప్రకాష్ రాజ్ ముందు నుంచీ ఉదాశీనంగానే ఉన్నారు. రెండు దశాబ్దాల క్రితమే ఆయన `మా` సభ్యుడు. అయితే.. ఇప్పటి వరకూ `మా`ని ఆయన పట్టించుకోలేదు. మాలో జరిగిన కార్యక్రమాలకు ఆయన హాజరు కాలేదు. అంతెందుకు..? ఓటు హక్కుని వినియోగించుకోవడానికి సైతం ప్రకాష్ రాజ్ రాలేదన్నది ఆయన ప్రత్యర్థుల వాదన. అలాంటిది ఇప్పుడు సడన్ గా వచ్చి నన్ను మా అధ్యక్షుడిగా గెలిపించమంటే.. అది కుదరని పని.
సెట్లో ప్రకాష్ రాజ్ ప్రవర్తన మీద చాలా విమర్శలున్నాయి. ఆయన సహ నటులకు పెద్దగా విలువ ఇవ్వరని, ఆయన సెట్ ని చెప్పిన సమయానికి రారని, ఆయన కోసం ఎదురు చూస్తూ, మిగిలిన నటీనటులు ఇబ్బంది పడిన క్షణాలు చాలా ఉన్నాయని ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వెళ్లగకక్కింది. ఇది ఓ రకంగా ప్రకాష్ రాజ్ కి పెద్ద మైనస్.
ప్రకాష్ రాజ్ వైఖరి చాలాసార్లు వివాదాంశమైంది. టాలీవుడ్ ఆయన్ని చాలాసార్లు బ్యాన్ చేసింది. `మా` ఎదురుగా ప్రకాష్ రాజ్ నిరాహార దీక్ష కూడా చేశారు. చివరికి పెద్దలు ముందుకొచ్చి, ఈ సమస్యని పరిష్కరించారు. ప్రకాష్ రాజ్ వివాదాలకు అతీతుడేం కాదు. ఆయన వైఖరి చాలామందికి నచ్చదు. ఈ పాయింట్ తో ప్రకాష్ రాజ్ ని ఓడించడానికి ప్రత్యర్థులు ఎత్తులు వేస్తున్నారు.
గతంలో ప్రకాష్ రాజ్ హిందువులకు వ్యతిరేకంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. హిందువులను కాకులతో పోల్చాడు. అది రాజకీయ పరమైన అంశమే అయినా, ఓ సామాజిక వర్గానికి బాధ కలిగించేలా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు. అప్పటి కామెంట్లకూ, మా ఎన్నికలకూ ఎలాంటి సంబంధమూ లేదు. కానీ పాత విషయాల్ని తవ్వి తీసి, ప్రకాష్ రాజ్ పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసి, ఆయన్ని ఓడించాలని చూస్తున్నారు. ఇక నాన్ లోకల్ అనే.. పాయింట్ ఎలాగూ ఉంది.
ఎన్ని విమర్శలు ఉన్నా – ప్రకాష్ రాజ్‌కి ఇప్పుడు అండగా మెగా సపోర్ట్ ఉంది. ప్రకాష్ రాజ్ ని గెలిపించే బాధ్యత నాగబాబు స్వయంగా తీసుకున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈమధ్య ప్రకాష్ రాజ్ వైఖరి చాలా మారింది. ఆయన సేవా కార్యక్రమాలు అందరి హృదయాల్నీ గెలుచుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో రెండు గ్రామాల్ని దత్తత తీసుకుని, ఆ గ్రామాల్ని అభివృద్ధి పరచడానికి ప్రకాష్ చేసిన ప్రయత్నాలు అభినందనీయం. అన్నింటికంటే ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గొప్ప కళాకారుడు. తనపై ఎన్ని నిందలు ఉన్నా.. ఉత్తమ నటుడిగా ఆయన అందుకున్న పురస్కారాల్ని విస్మరించలేం. అదే ప్రకాష్ రాజ్ గెలుపుకు అండ.. దండ!