ముఖ్యమంత్రి కేసీఆర్ హైటెక్ సిటీలో అత్యంత ఖరీదైన భూమిని కుల సంఘాలకు కేటాయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హైటెక్ సిటీ ఎదురుగా ఉండే అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో వంద కోట్లకుపైగా విలువ ఉన్న ఐదు ఎకరాలను ఈ రెండు కుల సంఘాలకు కేటాయించినట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేటాయింపు ప్రక్రియ శరవేగంగా సాగింది. రోజుల వ్యవధిలోనే సిఫార్సు చేయడం… సీసీఎల్ఏ ఆమోదించడం… ఆ తర్వాత ఉత్తర్వులు ఇవ్వడం జరిగిపోయాయి. అంత అత్యవసరంగా… అత్యంత విలువైన భూమిని ఈ కుల సంఘాలకు కేటాయించడంపై ఇప్పుడు చర్చ ప్రారంభమైంది.
కేసీఆర్ .. అన్ని కులాలకు భవనాలు కట్టిస్తామని ఎప్పుడో సీఎం అయిన మెదట్లో హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని శంకుస్థాపనలు చేశారు. కానీ ఇంత వరకూ ఒక్క భవనం కూడా పూర్తి కాలేదు. చాలా వాటికి కేటాయించిన స్థలాలు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. అయితే ఇప్పటి వరకూకేటాయించిన స్థలాలు.. చేసిన శంకుస్థాపనలు అన్నీ బీసీలు లేకపోతే ఇతర వెనుకబడిన వర్గాలవే. ఓసీల కోసం భవనాలు.. భూములు పెద్దగా కేటాయించలేదు. తొలి సారిగా కమ్మ, వెలమ సంఘాలకు కేటాయించారు. అదీ కూడా… అత్యంత విలువైన ప్రాంతంలో. వారు అక్కడ భవనాలు నిర్మించుకుని తమ కులం కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అది జూబ్లిహిల్స్తో కలిసిపోయింది. అలాంటి చోట… కుల సంఘాలకు భూములు కేటాయించడం ఖచ్చితంగా వివాదాస్పదమవుతోంది. ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయిస్తారు. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఊహించడం కష్టం. ఈ కుల సంఘాల వెనుక ఎవరు ఉన్నారు..? వాటి కార్యవర్గం ఏమిటి..? అన్న అంశాలపై ఎవరికీ స్పష్టత లేదు. ఏదో రాజకీయ ప్రయోజనం లేకపోతే.. ప్రభుత్వం కూడా ఇంత ఆఘమేఘాలపై స్పందించదన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.