కథ ఎలాంటిదైనా, క్యారెక్టర్లు ఏవైనా, అందులో కనిపించేవాళ్లు మాత్రం స్టార్లై ఉండాలన్నది నేటి సూత్రం. పోస్టర్ ఎంత నిండుగా కనిపిస్తే.. అంత మంచి బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు. పైగా పాన్ ఇండియా రేంజు ఆలోచనలు మొదలైపోయాయి కదా. అందుకే… తెలుగు సినిమాల్లో పరాయి నటీనటుల హవా మరింత ముదిరింది. వాళ్లని ఒప్పించడానికి క్యారెక్టర్లతో కాదు, క్యాష్ తో దిగబడిపోతున్నారు. అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో `ఏజెంట్` రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ ప్రధాన పాత్ర కోసం మమ్ముట్టిని సంప్రదించారు. ఈ పాత్రలో నటించడానికి మమ్ముట్టి అక్షరాలా రూ.3 కోట్లు డిమాండ్ చేశాడు. చిత్రబృందం కూడా ఓకే అంది. మలయాళంలో మమ్ముట్టి పెద్ద స్టార్. కానీ ఇప్పుడు ఆ హవా కొంచెం తగ్గింది. మోహన్ లాల్ తో పోలిస్తే.. మమ్ముట్టి బాగా వెనకబడ్డాడు. అయినా సరే, మమ్ముట్టికి రూ.3 కోట్లు ఇవ్వడానికి `ఏజెంట్` చిత్రబృందం రెడీ అయిపోయింది. సూరి సినిమాలన్నీ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్లు. ఈసినిమా కూడా అదే తరహాలో ఉంటుందని, మమ్ముట్టి పాత్ర చాలా క్లాస్ గా తీర్చిదిద్దుతున్నారని టాక్. అయితే ఈ సినిమా మమ్ముట్టి విలన్ కాదు. హీరో తండ్రి కూడా కాదు. మరి… ఎలా ఉండబోతోందో చూడాలి.