వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ శంకుస్తాపన చేయడం సంతోషమే. ఇది చారిత్రిక సందర్భమనీ, హరిహరరాయలు బుక్కరాయలు విజయనగరం స్థాపించిన రోజుతో పోల్చవచ్చనీ పొగిడారు అది కూడా ఓకే. మరి అంత చారిత్రిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం కూడా అందుకు తగినట్టు తయారు చేసుకోవద్దా? రాజధాని నిర్మాణ ప్రణాళికలు వెల్లడించవద్దా? ఆయన ప్రారంభ వాక్యాలు బాగున్నా తర్వాత హుద్‌హుద్, పట్టిసీమ ఇలా గత ఇరవై మాసాలుగా చెబుతూనే వున్న మాటలే చెబితే ప్రత్యేకత ఏమిటి? సలహాదారులూ వ్యూహకోవిదులూ ఏమైనట్టు? అసలు తాత్కాలిక సచివాలయం 200 కోట్ల ఖర్చుతో కట్టడం అవసరమా అనే విమర్శలు చాలా వచ్చాయి. నిన్న ఈ రోజు ఎపిలో పత్రికలు దానిపై చాలా చర్చ చేశాయి. అందుకే మంత్రులు అధికారులు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ భవనాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయని చెప్పారు. భవనాలు కట్టిన తర్వాత ఎలాగూ వుండిపోతాయి. కాని ఏడాదికి పైబడి ప్లాన్లు గీసిన వారు ఈ నిర్మాణంపై స్ఫష్టత ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రాజధాని శంకుస్తాపన ఒక చోట సచివాలయం మరోచోట ఎందుకు వస్తున్నాయి? ఇంత భారీ కీలక నిర్మాణం గురించే ఇదమిద్దంగా చెప్పలేనప్పుడు మిగిలిన వాటిపై చెప్పే మాటలు ఎలా నమ్మడం అనే ప్రశ్న వస్తుంది కదా?