కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌కు వచ్చిన బెదిరింపుల కాల్స్ వైసీపీలో కలకలం రేపుతున్నాయి. చుంపుతామని నేరుగా బెదిరించడమే కాదు.. ఎలా చంపుతామో కూడా ఉదాహరణగా చెప్పుకొచ్చారు. నందగిరి సుబ్బయ్య అనే టీడీపీ నేతను కొద్ది రోజుల కిందట.. ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూండగా..మరో వైపు నరికి చంపారు. అందరి ముందు హత్య చేసినా ఎవరూ బయటకు చెప్పలేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే చంపుతామంటూ రమేష్ యాదవ్‌ను హెచ్చరించిన ఆడియో టేపులు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆయన పోలీసులకు.. తమ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు.
ప్రొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్ వైసీపీలో చురుకైన నేత. ఆయన మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఆశించారు. కానీ ఎమ్మెల్యే మద్దతు లేకపోవడంతో ఆయనకు దక్కలేదు. ఈ కారణంగా వైసీపీ హైకమాండ్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఇది ఎవరూ ఊహించనిది. ఎందుకంటే.. కడప జిల్లాలో రిజర్వుడు నియోజకవర్గాలు తప్ప.. ఏ పదవుల్లో అయినా రెడ్డి సామాజికవర్గానికి చాన్సులు దక్కుతుంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏ ఆలోచన చేశారో రమేష్ యాదవ్‌కు చాన్సిచ్చారు. పదవీ ప్రమాణం చేసిన తర్వాత రమేష్ యాదవ్ ప్రొద్దుటూరులో భారీర్యాలీ నిర్వహించారు. బల ప్రదర్శన చేశారు. దీంతో వైసీపీలోనే కొంత మందికి గిట్టలేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణం వల్లే ఆయనకు బెదిరింపులు వచ్చాయని అనుమానిస్తున్నారు.
సొంత పార్టీ ఎమ్మెల్సీని చంపుతామని బెదిరించినా.. వైసీపీలోనూ.. అటు పోలీసుల్లోనూ పెద్దగా స్పందన లేదు. ఇంటర్నెట్ కాల్స్ ద్వారా వచ్చాయని.. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుంటామని.. పోలీసులు చెబుతున్నారు. ఈ అంశంపై హైకమాండ్ కూడా సీరియస్‌గా దృష్టి పెట్టలేదని చెబుతున్నారు. మొత్తానికి విపక్ష పార్టీల నేతలు కనీసం సోషల్ మీడియా పోస్టులు కూడా ధైర్యంగా పెట్టుకోలేని పరిస్థితుల్లో… వైసీపీలోనే… వర్గాలు ఒకరిపై ఒకరు…చంపుతామని బెదిరింపులకు దిగడం.. వారిపై పోలీసులు సాఫ్ట్ కార్నర్ చూపడం.. వైసీపీ నేతల్నే ఆశ్చర్య పరుస్తోంది. అలాగే లైట్ తీసుకుంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వైసీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది.