ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌పై తక్షణం చర్యలు తీసుకుని.. వాటికి సంబంధించిన నివేదికను తమకు సమర్పించాలని కేంద్ర హోంశాఖ .. ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్‌ను ఆదేశించింది. సీఐడీ చీఫ్ హిందూ వ్యతిరేకప్రసంగాలు చేస్తున్నారని.. నిబంధనలకు విరుద్ధంగా ఓ సంస్థను పెట్టి ఉగ్రవాదులకు మద్దతిచ్చేలా ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు.. లీగల్ రైట్స్ అడ్వైజరీ అనే స్వచ్చంద సంస్థ కన్వీనర్ కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. వారు ఫిర్యాదులు చేసిన తర్వాత.. ఆ వీడియోలను సునీల్ కుమార్ సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయించారు. అయితే అప్పటికే డౌన్ లోడ్ చేసి.. ఫిర్యాదు చేసినందున… కేంద్ర హోంశాఖ ఈ ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకుంది.
ఎంపీతో పాటు.. లీగల్ రైట్స్ అడ్వైజరీ సంస్థ చేసిన ఫిర్యాదులను ఆధారాలను.. ఏపీ సీఎస్‌కు .. కేంద్ర హోంశాఖ పంపింది. ఈ అంశం విషయంలో సునీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశించడంతో తప్పనిసరిగా ఏదో ఓ చర్య తీసుకోకతప్పని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. సాధరాణంగా .. సివిల్ సర్వీస్ అధికారులపై చర్యలు అంటే.. ముందుగా బదిలీ చేయడమే. దాన్నే పెద్ద శిక్షగా భావించి సరి పెడుతూ ఉంటారు. ఇప్పుడు సునీల్ కుమార్ విషయంలోనూ ఏపీ సర్కార్ బదిలీ వేటు వేస్తుందా.. లేక పోతే.. తమకు అత్యంత విశ్వాసపాత్రుడైన అధికారి కాబట్టి.. ఇంకో మార్గమేదైనా ఆలోచిస్తుందా అన్నది ఇప్పుడు అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ తీరు మొదటి నుంచి వివాదాస్పదమే. ఆయన కేవలం వైసీపీ పార్టీ కోసం.. ప్రభుత్వ పెద్దల రాజకీయ కక్షలు తీర్చుకోవడం కోసమే… తన డ్యూటీని చేస్తున్నారని.. అందు కోసం నిబంధనలు సైతం ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనపై అనేకానేక ఫిర్యాదులు కేంద్రానికి వెళ్లాయి. రఘురామరాజు అరెస్ట్ విషయంలో ఆయనపై కోర్టు ధిక్కార కేసు కూడా నమోదవనుంది. ఇప్పుడు సునీల్ కుమార్‌ను ప్రభుత్వం తప్పిస్తుందా.. లేకపోతే.. ఇంకేదైనా చర్యతీసుకున్నామని కేంద్రానికి రిపోర్ట్ ఇస్తుందా.. లేకపోతే.. ఆయన తప్పేమీ చేయలేదని.. వాదిస్తూ… కేంద్రానికి రివర్స్ లేఖ పంపుతుందా.. వేచి చూడాల్సి ఉంది.