తల్చుకుంటే గంటలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని వైసీపీ అద్యక్షుడు జగన్ అన్నట్టు కొన్ని కథనాలు విహారం చేస్తున్నాయి. వైసీపీ ఎంఎల్ఎల ఫిరాయింపు గురించిన ప్రశ్నకు అది ఆయన రాజకీయ సమాధానం కావచ్చు. ‘ టిడిపి ఎంఎల్ఎలే మాతో టచ్లో వున్నారు.. అయితే ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవసరమైన 21 మంది వున్నారని నేను చెప్పడం లేదు. వుంటే మీకు చెబుతాను.చెప్పిన గంటలోగా ప్రభుత్వం కూలిపోతుంది..’ ఇంచుమించుగా ఈ అర్థం వచ్చే మాటలు ఆయన అన్నట్టు ప్రత్యక్ష ప్రసారంలో నేను విన్నాను. ఇందులో అతిశయోక్తులు బెదిరింపులు వుంటే వుండొచ్చు గాని గంటలో కూల్చేస్తామన్న అర్థం నాకు కనిపించలేదు. ఆయనే నాకు అంత సత్తా లేదని చెప్పుకుంటే చంద్రబాబు అనుయాయులైన వారు (కొందరు మీడియా మిత్రులతో సహా) ఎందుకు మరోలా వ్యాఖ్యానాలు చేస్తున్నారో బోధపడటం లేదు. నిజానికి వైసీపీ శిబిరంలో అంత వూపు లేదు. ప్రభుత్వం పడిపోతుందన్న అంచనా కూడా లేదు. ప్రభుత్వాలు పేకమేడలు కాదు వూరికే పడిపోవడానికి.జగన్ కుట్రలు చేస్తున్నాడని ప్రచారం చేయడం కోసం ఆయన పార్టీకి లేనిపోని ప్రాధాన్యత నివ్వడం టిడిపి మొదటినుంచి చేస్తున్న పొరబాటే. శ్రుతిమించిన జగన్నామస్మరణ తెలుగుదేశంకు నష్టమని నేనెప్పుడూ చెబుతుంటాను. అదే పెద్ద వ్యూహమని భ్రమపడే వాళ్లు భ్రమ పెట్టేవాళ్లు ఆ పార్టీలో వున్నారు. విభజన ఉద్యమ కాలంలో ఒక దశలో తెలుగుదేశం ముందుకు వస్తే తప్పక ఆ ప్రభుత్వం పడిపోయేది. దానివల్ల జగన్కు లాభం జరుగుతుంది గనక ఆ పార్టీ విమర్శలనైనా భరించింది గాని అవిశ్వాసానికి సహకరించలేదు. టిడిపి ముందుకు వచ్చిందనే సంకేతాలుంటే కాంగ్రెస్ నుంచి మరింత మంది వైసీపీలో చేరేవారు. అలా జరక్కూడదనే అవిశ్వాసాన్ని వాయిదా వేసింది టీడీపి. ఆ రోజుల్లో చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఈ విషయం స్పష్టంగానే చెప్పేవారు. కెసిఆర్ జగన్ వీరిద్దరిపట్ల చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అభద్రతా వ్యూహంతో వ్యవహరించారు. మరో వంక వారిని ఖాతరు చేయనవసరం లేదన్నట్టు పైకి మాట్లాడారు. ఈ గందరగోళం పార్టీని బాగా ఇబ్బందిలో పెట్టింది.దానివల్ల ఎవరికి లాభం జరిగిందో ఇప్పుడు టిడిపి విశ్లేషించుకోవచ్చు. జగన్ అధికారంలోకి రాలేకపోవచ్చు గాని బలీయమైన ప్రత్యర్థిగానే వున్నారు. కెసిఆర్ సరేసరి. ఎన్నికల తర్వాతా ఓటుకు నోటు వంటి దుస్సాహసంతో టిడిపి తనకు తను నష్టం చేసుకోవడమే గాక రెండు రాష్ట్రాల మధ్య సమతుల్యత దెబ్బతినడానికి కూడా కారణమైంది. దీన్నుంచి తగు గుణపాఠాలు నేర్చుకోనవసరం లేదా? జగన్పై ఎన్ని కేసులు వున్నా ఆయనది అనుభవం లేని అహం అని విమర్శించినా 67 మంది ఎంఎల్ఎలతో ఏకైక ప్రతిపక్షంగా సభలో వున్నారనేది నిజం. రాజ్యాంగ రీత్యా ఆయన స్థానం ఆయనది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలెప్పుడూ కూలిపోలేదు. ఎన్టీఆర్ హయాంలోనే రెండు సార్లు అత్యధిక మెజార్టి వున్న ప్రభుత్వాలు కూలిపోయాయి. అందులో ఒకదానికి చంద్రబాబే నాయకత్వం వహించారు. అధికారంలేదు గాని టిటిడిపి కూడా కెసిఆర్ ధాటికి అలాగే నామకార్థమై పోయింది. జగన్ తనకు అంత బలం లేదని చెబుతుంటే గంటలో కూల్చడం గురించి కథలు వదలడం ప్రభుత్వానికే నష్టం. కనుక అప్రమత్తంగా వుండకపోతే బలాబలాలు మారడానికి పెద్దసమయం పట్టదు..