కృష్ణా జలాలపై తాడో పేడో తేల్చుకునేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని.. ఏపీ సీఎం జగన్ లేఖలు రాస్తే తాను స్వయంగా ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవాలని అనుకుంటున్నట్లుగా మూడు రోజుల కిందట టీఆర్ఎస్ వర్గాలు మీడియాకు లీక్ ఇచ్చాయి. అయితే కేసీఆర్ ఢిల్లీ టూర్ ఫిక్స్ కాలేదు కానీ.. మరోసారి కృష్ణాబోర్డుకు లేఖ మాత్రం పంపారు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిని అపాలంటూ కృష్ణాబోర్డు ఆదేశించడం కరెక్ట్ కాదని…అసలు శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించిన ప్రాజెక్టు అని తెలంగాణ వాదిస్తోంది. 1959 లో విద్యుత్ ప్రాజెక్టు అప్పటి ప్లానింగ్ కమిషన్ అనుమతి ఇచ్చిన విషయాన్ని ఎపి ప్రభుత్వం , కెఆర్ఎంబీ గుర్తించాలని కోరింది. 1963 లో శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లను విద్యుత్ ఉత్పత్తికి తప్ప మిగత అవసరాలకు విడుదల చేయవద్దని చెప్పిందని కొన్ని లేఖలు విడుదల చేశారు.
వివాదం మరింత ముదురుతుండటంతో లేఖలు రాసి ఉరుకోకుండా ఢిల్లీకి వెళ్లి కేంద్రం వద్ద తేల్చుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని..ఢిల్లీలో ప్రధాని , కేంద్ర కలమంత్రి శాఖను కలవాలని అనుకుంటున్నారు. అందుకే.. తొమ్మిదో తేదీన కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ జరగాల్సి ఉంది. కానీ ఆ భేటీ వద్దని కేసీఆర్ అంటున్నారు. ఏపీ ఫిర్యాదులపైనే ఆ కమిటీ భేటీలో చర్చ జరుగుతుందని అనుకుంటున్న కేసీఆర్…ఆ సమావేశాన్ని రద్దు చేసి.. జులై 20న పూర్తి స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ అంత ఈజీగా ఢిల్లీ పర్యటనకు వెళ్లరు. ఒక వేళ వెళ్తే.. కృష్ణా జలాలపై వివాదాల విషయంలో బీజేపీ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇస్తారా లేదా అన్నది సందేహమే. ఎందుకంటే.. జల వివాదాల విషయంలో కేంద్రం వరకూ వెళ్లబోమని.. అసలు కేంద్రం ఏమీ పరిష్కారాలు చూపించడం లేదని గతంలో ఆరోపించింది కేసీఆరే. ఇప్పుడు ఆయన న్యాయం మీరే చెప్పాలి అంటూ వెళ్తే వినేందుకు బీజేపీ పెద్దలకు తీరిక ఉండదని అంటున్నారు. అదే సమయంలో ఇదంతా రాజకీయం అనే ఫీడ్ బ్యాక్.. తెలంగాణ బీజేపీ నుంచి హైకమాండ్‌కు వెళ్తోంది. అందుకే… కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రకటనలు.. లీక్‌లకే పరిమితమని అంటున్నారు.