తమిళనాట బిజెపి పార్టీకి సినీ హీరోల కి మధ్య మాటల యుద్ధం కొత్త కాదు. గతంలో స్టార్ హీరో విజయ్, అజిత్ లతో తమిళనాడు బిజెపి గొడవ పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా గజిని హీరో సూర్య మీద విరుచుకు పడింది తమిళనాడు బిజెపి. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో బిజెపి రాష్ట్ర యువజన కార్యవర్గం నిన్న ఒక సమావేశం నిర్వహించింది. రాబోయే రోజుల్లో అమలు చేయాల్సిన ఏడు తీర్మానాలను ఆమోదించింది. వాటిలో ఒకటి నీట్ విషయంలో నటుడు సూర్య కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టడాన్ని ఖండించడం . నటుడు సూర్య గతంలో బిజెపి ప్రభుత్వం తీసుకొస్తున్న నీట్ విధానం తమిళనాడులోని పేద విద్యార్థులకు శాపంగా మారుతోందని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో సూర్య చేసిన ఆ వ్యాఖ్యలను బీజేపీ ఇప్పుడు ఖండిస్తూ తీర్మానం చేసింది. సూర్యా నీట్ ఎంపిక గురించి అవాస్తవాలు ప్రచారం చేయడమే కాకుండా, మోడీ ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాలను కూడా తన సొంత ప్రయోజనాల కోసం, ప్రమోషన్ కోసం వ్యతిరేకిస్తున్నాడు అని ఈ తీర్మానం పేర్కొంది. సూర్య తన సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టాలని అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదని తమిళ బిజెపి నేతలు సూర్య కు వార్నింగ్ ఇచ్చారు.
అయితే తమిళనాట ప్రజా మద్దతు మాత్రం సూర్య కే ఉంది. గతంలో మెర్సల్ సినిమాలో బిజెపికి వ్యతిరేకంగా విజయ్ వ్యాఖ్యలు చేశాడని ఇప్పుడు తమిళనాడు గవర్నర్ గా ఉన్న తమిళ సై పోరాటాలు కూడా చేసింది. కానీ దాని వల్ల విజయ్ కి జరిగిన నష్టం ఏమీ లేదు. అదేవిధంగా అజిత్ బిజెపి లో చేరబోతున్నాడని అజిత్ అభిమానులు బిజెపిలో చేరాలని బిజెపి అప్పట్లో ఒక ప్రచారం చేయగా, అజిత్ – బిజెపికి తనకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటన విడుదల చేసి ఆ తతాంగానికి ఫుల్స్టాప్ పెట్టాడు. మరి సూర్య ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.