కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా నేత.. ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే అనేక మంది ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. చివరికి వారు ఆ కార్యక్రమం చేయలేరు. ఇప్పుడా వర్గ పోరాటాలు తెలంగాణ బీజేపీలోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. బండి సంజయ్ పాదయాత్రను కార్యవర్గ సమావేశంలో ప్రకటించారు. ఆగస్ట్ 9నుంచి అక్టోబర్ 2వరకు తొలివిడత పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. తొమ్మిదో తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుండి పాదయాత్ర మొదలు కానుంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రాంతాల మీదుగా పాదయాత్ర సాగుతుంది.
చేవెళ్ల మీదుగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించనున్నారు. తొలి విడత పాదయాత్రను అక్టోబర్ 2న హుజూరాబాద్ లో ముగించేలా బండి సంజయ్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పాదయాత్ర పేరుతో బండి సంజయ్ దూకుడుగా వెళ్తూండటం పార్టీలోని ఇతర సీనియర్లకు నచ్చడం లేదు. బండి సంజయ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ గతంలోనే కొంత మంది కామెంట్లు చేయడంతో… ఇప్పుడు కొంత మంది ఆయనపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి వర్గం… ఆయనను దూరం పెడుతోంది. ముఖ్యంగా కిషన్ రెడ్డికి హైకమాండ్ వద్ద పలుకుబడి.. పట్టు ఉండటంతో .. బండి సంజయ్‌కు నేరుగా పెద్దలతోమట్లాడేందుకు యాక్సెస్ దొరకడం లేదు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ కూడా.. ఎక్కువగా కిషన్ రెడ్డి ద్వారానే సమాచారం సేకరించకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బండి సంజయ్ ఒంటరైన ఫీలింగ్ ఏర్పడింది.
అయితే.. రాష్ట్ర కార్యవర్గంలో అత్యధికులు ఆయన నియమించుకున్న వారే కావడంతో.. పార్టీ అనుమతితోనే పాదయాత్ర చేస్తున్నా అన్న ఫీలింగ్ కల్పించేందుకు తీర్మానం చేయగలిగారు. కానీ.. ఆయన పాదయాత్ర ప్రారంభం కాకుండా ఉండేందుకు చేయాల్సినదంతా చేస్తారని..అంటున్నారు. అందుకే.. బండి సంజయ్ పాదయాత్ర ప్రకటన వరకేనని… అది ముందుకు సాగదని కొంత మంది నేరుగానే చెబుతున్నారు. ఎలా చూసినా తెలంగాణ బీజేపీ రాజకీయాలు.. కాంగ్రెస్‌ను మించి పోతున్నాయన్న అభిప్రాయం మాత్రం వారి పార్టీలోనే వ్యక్తమవుతోంది.