సాటిమనిషిని హత్య చేయడం దారుణమైన నేరం. అయితే ఈ దేశంలో గౌరవ హత్యలు, సతీ సహగమనాలు రకరకాల ఆచారాల పేర్లతో అలాటివి జరుగుతూనే వున్నాయి. ఇదేగాక నయం కాని వ్యాధులతో అమితంగా బాధపడేవారి ప్రాణాలు తీయడం ద్వారా ఉపశమనం కలిగించే కారుణ్య హత్యలు వుండాలని కూడా ఒక వాదన సాగుతూనే వుంది.ఎత్నేసియా పేరిట కొన్ని దేశాల్లో అమలవుతున్నా అత్యధిక చోట్ల దీన్ని నేరంగానే పరిగణిస్తున్నారు. భారత దేశంలోని న్యాయస్థానాలు కూడా అనేక కోణాలవల్ల ఇందుకు అనుమతించడం లేదు. అయితే ఆశ్చర్యం ఏమంటే తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో చాలా కాలంగా ముసలివాళ్లను చంపే దుర్మార్గం ఆచారంగా నడుస్తున్నది. అనారోగ్యంతో బాధపడుతున్నారనీ, ఇంతకన్నా చావే మెరుగని ఏవో చెబుతూ వృద్ధుల ప్రాణాలు తీసేస్తున్నట్టు మద్రాసు యూనివర్సీటీ నేర అధ్యయన విభాగానికి చెందిన డాక్టర్ ప్రియంవద పరిశోధించి తేల్చారు.తేనా జిల్లాలో ఇలాటి ఘటనలు జరుగుతున్నట్టు తెలిసి విచారిస్తే విరుధు, మదురై జిల్లాల్లోనూ ఆ అమానుషం అమలులో వున్నట్టు తెలిసింది. ఆమె విచారించిన వారిలో 30 శాతం మంది ఇలాటి ఘటనలు వెల్లడించారు. వైద్య పరిభాషలో దీన్ని జెరాంటిసైడ్ అంటే వృద్ధుల హత్య అని అంటున్నారు. తలిదండ్రులను వృద్దాశ్రమాలకు పంపడం, బస్టాండు వంటిచోట్ల వదలివేయడం గురించి వింటుంటాం గాని ఇలా పెద్దలను బలితీసుకునే దుర్మార్గం దశాబ్దాలుగా సాగుతుందంటే దిగ్భ్రాంతి కలుగుతుంది.